Sachin Tendulkar: 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఫొటో పంచుకున్న సచిన్
- 40 ఏళ్ల కిందట తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు
- జూన్ 25న జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ పై కపిల్ సేన విజయం
- నాటి చారిత్రాత్మక క్షణాలను స్మరించుకున్న సచిన్ టెండూల్కర్
- భారత క్రికెట్ దశ దిశను మార్చిన క్షణాలు ఇవేనని వెల్లడి
- తనకు స్ఫూర్తినిచ్చింది ఈ విజయమేనని వివరణ
సరిగ్గా 40 ఏళ్ల కిందట ఇదే రోజున (జూన్ 25) భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన అపురూప ఘట్టం నమోదైంది. లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎలాంటి అంచనా లేకుండా బరిలో దిగి, మేటి జట్లను ఓడించి, ఫైనల్లో అజేయం అనుకున్న మహా జట్టు వెస్టిండీస్ ను కంగు తినిపించి సగర్వంగా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టిన కపిల్ సేన యావత్ భారతావనిని పులకింపజేసింది.
అప్పటివరకు గవాస్కర్, వెంగ్ సర్కార్ బ్యాటింగ్ నైపుణ్యాలు, కపిల్ దేవ్ బౌలింగ్ ప్రతిభ, గుండప్ప విశ్వనాథ్, సయ్యద్ కిర్మానీల వికెట్ కీపింగ్ చతురతల గురించి అడపాదడపా మాట్లాడే క్రికెట్ పండితులు... అప్పటి నుంచి ఓ జట్టుగా భారత్ ఎంత బలమైనదో చర్చించడం మొదలుపెట్టారు.
అనామక స్థాయి నుంచి ప్రపంచ చాంపియన్ గా ఎదిగిన ఆనాటి భారత జట్టు ఇప్పటికీ అద్భుతమే. నాటి అపూర్వ క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ టీమిండియా బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో స్పందించారు.
1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఫొటోను పంచుకున్నారు. భారత క్రికెట్ దశ దిశను మార్చింది ఈ వరల్డ్ కప్పేనని సచిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ క్షణమే తన జీవిత గమ్యం ఏంటో శాశ్వతంగా నిర్ధారణ అయిందని, తాను క్రికెట్ బాట పట్టడానికి స్ఫూర్తిగా నిలిచిందని సచిన్ వివరించారు. నాటి చాంపియన్ టీమ్ లోని సభ్యులందరికీ నీరాజనాలు అర్పిస్తున్నానని తెలిపారు.