Pawan Kalyan: నేను సినిమాలు తీసి పార్టీని నడుపుతున్నాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan says how he is running his party

  • స్థానిక సమస్యలపై జనసేన ఉద్యమించి పార్టీని బలోపేతం చేయాలని సూచన
  • గోదావరి జిల్లాలపై దృష్టి పెడతానని వ్యాఖ్య
  • తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందేనన్న పవన్

తాను సినిమాలు తీసి పార్టీని నడుపుతున్నానని, కానీ ఇసుక దోపిడీ.. మైనింగ్ దోపిడీ చేయలేం కదా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం అన్నారు. అలా దోపిడీ చేస్తానంటే జనసేన ఎందుకని, వైసీపీ చాలు అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం నాయకులతో సమావేశమైన జనసేనాని మాట్లాడుతూ... స్థానిక సమస్యలపై జనసేన ఉద్యమించి ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

 గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, సమయం కేటాయిస్తానని చెప్పారు. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఎక్కడికక్కడ జనసేన పోరాటం చేయాలన్నారు. గన్నవరంపై తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తానని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేందుకు కులం చూడవద్దని, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా శిక్షపడాలన్నారు. హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మనవాడు తప్పు చేసినా శిక్షించాల్సిందే అన్నారు.

నాయకులు చేసే తప్పు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందని తాను గ్రహించానని చెప్పారు. నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ఇప్పటి జనసేన నాయకులకు ఉన్న కమిట్మెంట్ 2009లో ఉండి ఉంటే కనుక పార్టీని విలీనం చేయాల్సిన అవసరం రాకపోయేదన్నారు. మనం ఎమ్మెల్యేను గెలిపించగలుగుతాం.. కానీ పాలసీలు చేయించలేమన్నారు. గెలిచిన వారికి కమిట్మెంట్ ఉండాలన్నారు. జవాబుదారీతనం లేని నాయకులు అంటే తనకు ఆసక్తి ఉండదని చెప్పారు. 2014లో చీకట్లో బయలుదేరిన నాకు 2019లో రాజోలు చిరుదీపం అందించిందన్నారు. రాజోలు నుండి జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యే వెళ్లిపోవచ్చు.. కానీ ఇక్కడి వారు తమను గెలిపించారన్నారు.

రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తామంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయాడన్నారు. ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గోదావరి జిల్లాలలో తమకు 18 శాతం మంది ఓటు వేశారన్నారు. జనసేనకు 20 లక్షల మంది ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే పార్టీ నుండి వెళ్లిపోయినా జనసైనికులు, ప్రజలు అండగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. మనల్ని పాలించే నాయకుడు మనకంటే నిజాయతీ కలిగిన వాడు అయితేనే అందరికీ న్యాయం చేస్తాడన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని చెప్పారు. తాను రెండు చేతులు జోడించి చెబుతున్నానని, తాను కలవలేదని అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మీ కష్టాన్ని నేను గుర్తిస్తానని, చాలామంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. తాను రోడ్డు మీద ఆగి కూడా సామాన్యులతో మాట్లాడుతానని చెప్పారు.

  • Loading...

More Telugu News