Vladimir Putin: వెన్నుపోటు పొడిచాడు.. రష్యాను రక్షించుకునేందుకు ఏమైనా చేస్తా: పుతిన్
- వ్యక్తిగత లబ్ధి కోసం వాగ్నర్ గ్రూప్ అధిపతి ద్రోహం చేస్తున్నాడన్న పుతిన్
- ద్రోహులు ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిక
- రష్యాలో అంతర్యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని వ్యాఖ్య
వ్యక్తిగత లబ్ధి కోసం వాగ్నర్ గ్రూప్ అధిపతి ద్రోహం చేస్తున్నాడని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమయంలో దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. అలాంటి ద్రోహులు ఫలితం అనుభవించక తప్పదని మండిపడ్డారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో.. రష్యా ప్రజలను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు.
‘‘సొంతలాభం కోసం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ద్రోహం చేస్తున్నారు. ఇది రష్యాకు వెన్నుపోటు. దేశ ద్రోహచర్య. దీనికోసం ఆయుధాలు చేతపట్టినవారిపై కఠిన చర్యలు తప్పవు. దేశ ప్రజలను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాను’ అని తీవ్ర హెచ్చరికలు పంపారు. రష్యాలో అంతర్యుద్ధం జరగకుండా శాయశక్తులా అడ్డుకుంటానని, ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు రష్యాకు ఘోరమైన ముప్పు అని పుతిన్ అన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతోనే వాగ్నర్ చీఫ్ ద్రోహానికి పాల్పడ్డాడని పుతిన్ మండిపడ్డారు. రష్యా దక్షిణ నగరం రోస్తోవ్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని.. పరిస్థితిని అదుపులోకి తెస్తామని అన్నారు. రష్యాను వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డాడని, దానికి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
పుతిన్ ప్రసంగానికి ముందు రక్షణ మంత్రి.. వాగ్నర్ సైన్యంతో మాట్లాడారు. ‘‘మీరంతా మెసానికి గురయ్యారు. మిమ్మల్ని ఒక నేరంలోకి నెట్టేశారు’’ అని అన్నారు. వారంతా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వారి భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.