leopard: బావిలో పడిన చిరుత పులి.. బయటకు ఎలా వచ్చిందంటే..!
- ఓ గ్రామంలోని బావిలో పడిపోయిన చిరుత
- బయటకు రప్పించేందుకు పోలీసు సిబ్బంది నానా అవస్థలు
- చివరికి మంటతో భయపెట్టడంతో నిచ్చెన ఆధారంగా పైకి వచ్చేసిన చిరుత పులి
ఓ చిరుత పులి గ్రామంలోకి ప్రవేశించింది. వేగంగా పరుగెత్తే క్రమంలో ఓ బావిలో పడిపోయింది. దీన్ని గ్రామస్థులు కనిపెట్టారు. దాన్ని బయటకు రప్పించాలంటే అటవీ అధికారులకు సాధ్యమే. వారు మత్తు మందు ఇచ్చి దాన్ని పట్టేసుకోవచ్చు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బందో లేక పోలీసులో తెలియదు కానీ, ఎవరో ఒకరు వచ్చినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. వారి దగ్గర చిరుత పులికి మత్తు మందు ఇచ్చే ఎక్విప్ మెంట్ లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు.
బావిలోకి ఓ నిచ్చెన విడిచి పెట్టారు. దాని సాయంతో చిరుత పైకి వస్తుందేమోనని చూశారు. కానీ పైన జనాలు ఉండేసరికి ప్రాణభయంతో అది బయటకు రావడం లేదు. దీంతో ఓ పొడవాటి కర్రకు చివర్లో గుడ్డ చుట్టి దానికి మంట అంటించారు. ఆ కర్రను కిందకు పంపించి చిరుత పులిని బెదిరించారు. దీంతో అది అక్కడి నుంచి నిచ్చెన ఎక్కి బయటకు వచ్చింది. బావి మీద నుంచి గోడమీదకు దూకేసి, ఆ తర్వాత మైదానంలో పరుగున పారిపోయింది. ఈ వీడియోని సహానా సింగ్ అనే రచయిత షేర్ చేశారు.