Lalu Prasad Yadav: ఇకనైనా పెళ్లి చేసుకోవయ్యా... విపక్షాల సమావేశంలో రాహుల్ కు లాలూ సలహా

Lalu says Rahul to get marry

  • పాట్నాలో విపక్షాల సమావేశం
  • హాజరైన రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు
  • రాహుల్ పెళ్లి ప్రస్తావన తెచ్చిన లాలూ
  • అమ్మను వేదనకు గురిచేయకుండా... పెళ్లి చేసుకో అంటూ సూచన

బీహార్ రాజధాని పాట్నాలో సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో లాలూ తనదైనశైలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లికి ససేమిరా అంటున్న రాహుల్ ను ఓ తండ్రిలా మందలించారు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడం అంటే తల్లి (సోనియా గాంధీ)కి వేదన కలిగించడమేనని అన్నారు. 

నువ్వు మా సూచనను పట్టించుకోవడంలేదంటూ రాహుల్ పై లాలూ చిరుకోపం ప్రదర్శించారు. పెళ్లి చేసుకోవాలని ఇంతకుముందు కూడా రాహుల్ కు చెప్పానని, తన మాట వినుంటే రాహుల్ కు ఈపాటికి పెళ్లయిపోయి ఉండేదని అన్నారు.

పెళ్లి వద్దంటూ అమ్మకు ఇంకా చిరాకు తెప్పించకు అని లాలూ హితవు పలికారు.  మా మాట విను... పెళ్లి చేసుకో... నీ పెళ్లి ఊరేగింపులో మేం పాల్గొనాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. 

లాలూ తన పెళ్లి గురించి మాట్లాడడంతో రాహుల్ కాస్త సిగ్గుపడ్డారు. చిరునవ్వుతోనే లాలూ మాటలను స్వీకరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వయసు 53 సంవత్సరాలు. ఆయన ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే రాహుల్ కు విదేశాల్లో గాళ్ ఫ్రెండ్ ఉందంటూ పలు కథనాలు వచ్చినా, ఆయనెప్పుడూ ఈ విషయంలో స్పందించలేదు.

Lalu Prasad Yadav
Rahul Gandhi
Marriage
Congress
  • Loading...

More Telugu News