: నేను రాజీనామా చేయనన్నానా? ఎందుకు డిస్మిస్ చేసారు? : డీఎల్ ఆగ్రహం
పార్టీ నియమావళి ఉల్లంఘించను కానీ, పార్టీని ముంచేస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాడు. సీఎల్పీ సమావేశమందిరానికి తాళం వేయడంతో ఆరుబయటే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై ఆయన విరుచుకుపడ్డారు. నేరుగా ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్య భారత దేశంలో దురదృష్టకరమైన రీతిలో తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసారు.
అయితే, దీనిపై తానెవరికీ ఫిర్యాదు చేయనని స్పష్టం చేశారు. మొన్నటి లండన్ పర్యటనలో అత్యుత్తమ పార్లమెంటరీ వ్యవస్థను చూసానని ఆనందం వ్యక్తం చేసారు. అక్కడి పార్లమెంటరీ వ్యవహారలకు ఇక్కడి సభా నిర్వహణకు చాలా తేడా ఉందని తెలిపారు. ఇంతవరకూ తాను మంచిని మంచన్నానని, మంచి చేయకపోతే మంచిది కాదని చెప్పానని స్పష్టం చేశారు. అంతేగాకుండా, ప్రభుత్వ పథకాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
అమ్మ హస్తానికి సరుకుల్లేవన్న ఆయన, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఒక్క సంచీ కూడా పంపిణీ జరగలేదని తెలిపారు. 'ఇందిరమ్మ కలలు' పథకం మంచిదే కానీ, దీని ద్వారా ఎంతమంది న్యాయం జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రిని సూటిగా అడిగారు. అసలు 'ఇందిరమ్మ కలల'కు ఎంత ఖర్చుపెడుతున్నారని నిలదీసారు. సబ్ ప్లాన్ అమలు కోసం దామోదర రాజనర్సింహ ముందుకొస్తే, దళితుడు కనుక ఆయన్ని ప్రక్కన పెట్టి, ప్రచార ప్రకటనలలో సీఎం ఊరేగుతున్నాడని ధ్వజమెత్తారు.
బంగారు తల్లి పథకం ఇంకా అమలుకు నోచుకోక ముందే దానికి విపరీతమైన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కానీ, దాని అమలు ఎప్పుడనేది దేవుడికే తెలియాలని డీఎల్ ఎద్దేవా చేశారు. 2005లోనే ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా పేదలకు ముక్కుపుడకలు పంచామని చెప్పుకొచ్చారు. బంగారు తల్లి అమలు అటుంచితే,కిలో బియ్యం పథకమైనా అమలవుతుందోలేదో తెలియడంలేదని ఎద్దేవా చేసారు. ఇక ప్రభుత్వ పథకాల ప్రచారంలో రాజీవ్ యువ కిరణాల ఊసేలేదని ఆరోపించారు.
వడ్డీలేని రుణం(ఇందిరా క్రాంతి ) ప్రభుత్వ ఉద్యోగ జాతర, ఇందిర జల ప్రభ , రాజీవ్ విద్యా జీవనం, ప్రభుత్వ పథకాల అమలులో కనీసం వాటి ప్రచారానికైన ఖర్చు కూడా పెట్టడంలేదని ఆక్షేపించారు. మీసేవ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం రావాలంటే నెల రోజులు పడుతోందన్నారు. ఇప్పటివరకూ రాజ్యాంగ బద్ధంగానే విధులు నిర్వర్తించానని, తానెప్పడూ అధికారం కోసం ప్రాకులాడలేదన్నారు. ఈ రకంగా అవమానించడం సరికాదన్న డీఎల్, తనను ఎందుకు డిస్మిస్ చేసారని ప్రశ్నించారు.