Narendra Modi: 30 ఏళ్ల కిందట వైట్ హౌస్ ను బయటి నుంచి చూశాను: ప్రధాని మోదీ

Modi says he had seen white house from outside 30 years ago
  • వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
  • బైడెన్ దంపతుల స్వాగతానికి ముగ్ధుడైన మోదీ
  • మోదీ, బైడెన్ సంయుక్త మీడియా సమావేశం
  • ఇది 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవం అని పేర్కొన్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి వైట్ హౌస్ లో సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, బైడెన్ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, అమెరికాలోని 40 లక్షల మంది ఎన్నారైలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 

30 ఏళ్ల కిందట ఓ సామాన్యుడిలా అమెరికా పర్యటనకు వచ్చానని, నాడు బయటి నుంచి వైట్ హౌస్ ను చూశానని మోదీ వెల్లడించారు. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చానని, ఈసారి పెద్ద ఎత్తున జన నీరాజనాలతో వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయని వివరించారు. 

అమెరికాలో ఉన్న ఎన్నారైలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని కొనియాడారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందించారని ప్రశంసించారు. భారత్, అమెరికా ఇరు దేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమయ్యాయని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలే పరమావధి అని స్పష్టం చేశారు. 

కరోనా సంక్షోభం వేళ ప్రపంచం కొత్త రూపు సంతరించుకుందని తెలిపారు. ఇరు దేశాల స్నేహం విశ్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేసిందని వివరించారు. ప్రపంచ ఆహారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని కీర్తించారు.
Narendra Modi
White House
Joe Biden
India
USA

More Telugu News