Victor-6000: కుబేరులను తీసుకెళుతూ గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు రంగంలోకి విక్టర్-6000
- టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్ మెరైన్
- ఉన్నట్టుండి ఆచూకీ లేకుండా పోయిన వైనం
- సహాయక చర్యలు ముమ్మరం
- జలాంతర్గామిలో ఆక్సిజన్ ఈ సాయంత్రం వరకే సరిపోతుందంటున్న నిపుణులు
దశాబ్దాల కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూడ్డానికి వెళ్లిన ఓషన్ గేట్ టైటాన్ అనే సబ్ మెరైన్ ఆచూకీ లేకుండా పోవడం తెలిసిందే. ఈ సబ్ మెరైన్ లో పలువురు ప్రపంచ కుబేరులు ఉండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ మినీ జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ ప్రాణవాయువు ఈ సాయంత్రం 7.15 గంటల వరకే సరిపోతుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు.
తాజాగా టైటాన్ సబ్ మెరైన్ ఆచూకీ కోసం ఫ్రాన్స్ దేశానికి చెందిన విక్టర్-6000 అనే అత్యాధునిక ఆక్వాటిక్ రోబోను కూడా రంగంలోకి దించారు. 4.5 టన్నుల బరువున్న ఈ భారీ రోబో సముద్రంలో 20,000 అడుగుల లోపలి వరకు వెళ్లగలదు. గల్లంతైన టైటాన్ సబ్ మెరైన్ కంటే ఇది ఎక్కువ లోతులో ప్రయాణించగలదు.
అయితే, ఈ ఫ్రెంచ్ రోబో టైటాన్ సబ్ మెరైన్ ను గుర్తించినా, దాన్ని స్వయంగా వెలుపలికి తీసుకురాలేదు. టైటాన్ కు కొన్ని కేబుల్స్ అనుసంధానం చేసి వాటిని ఉపరితలంపైకి తీసుకువస్తుంది. ఉపరితలంపై ఉన్న భారీ యంత్రాల ద్వారా టైటాన్ ను సముద్ర గర్భం నుంచి బయటికి తీసుకువస్తారు. ఈ విక్టర్-6000 రోబో ఏకధాటిగా మూడ్రోజుల పాటు పనిచేయగలదు.
కాగా, సముద్ర గర్భంలో కొన్ని చోట్ల ధ్వనులు వస్తున్నప్పటికీ, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కచ్చితంగా గుర్తించలేకపోయారు.