Upendra Yadav: ఎవరీ ఉపేంద్ర యాదవ్... టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో నయా వికెట్ కీపర్...!

Team India selector reportedly eyes on Uttar Pradesh wicket keeper Upendra Yadav

  • వచ్చే నెలలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
  • జూన్ 27న జట్టు ఎంపిక
  • ఇటీవల వికెట్ కీపర్ గా విఫలమవుతున్న కేఎస్ భరత్
  • పంత్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిన ఆంధ్రా వికెట్ కీపర్
  • యూపీ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం

టీమిండియా క్రికెట్ జట్టు వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును జూన్ 27న ఎంపిక చేయనున్నారు. అయితే విండీస్ తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియాలో భారీగా మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ముఖ్యంగా, వికెట్ కీపర్ కేఎస్ భరత్ పై వేటు పడడం ఖాయమని తెలుస్తోంది. టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో, గత కొంతకాలంగా తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ భారత జట్టు వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్ లలో భరత్ కేవలం 129 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లోనూ భరత్ పేలవంగా ఆడాడు. 

ప్రస్తుతం నడవడానికే ఇబ్బందిపడుతున్న పంత్ తిరిగి జట్టులో చేరాలంటే చాలా సమయం పట్టేట్టుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా సెలెక్టర్లు కొత్త వికెట్ కీపర్ పై కన్నేశారు. అతడి పేరు ఉపేంద్ర యాదవ్. 

ఇటీవల దేశవాళీ క్రికెట్లో ఉపేంద్ర యాదవ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఉపేంద్ర యాదవ్ విశేషంగా రాణిస్తున్నాడు. రంజీల్లో ఉపేంద్ర యాదవ్ 47 ఇన్నింగ్స్ లలో 45 సగటుతో 1,666 పరుగులు చేశాడు. వాటిలో 5 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 203 నాటౌట్. మొత్తం 10 సార్లు నాటౌట్ గా నిలిచాడు. 

26 ఏళ్ల ఉపేంద్ర యాదవ్ 2016లో రంజీల్లో అడుగుపెట్టాడు. దేశవాళీ పోటీల్లో వికెట్ కీపింగ్ ప్రతిభతో యూపీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, విండీస్ టూర్ కు వెళ్లే టీమిండియాలో ఉపేంద్ర యాదవ్ కు చోటివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News