El Nino: ఎల్ నినోతో సమస్యలు తప్పవు.. వచ్చే వేసవిలో మంటలే: హెచ్చరిస్తున్న నిపుణులు
- ఇప్పటికే కనిపిస్తున్న ఎల్ నినో పరిస్థితులు
- రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశాలు
- శీతాకాల వర్షాలు, వచ్చే వేసవి సీజన్ పైనా ప్రభావం
ఎల్ నినోతో ఈ ఏడాది దేశ వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ చివరికి వచ్చినా, ఇప్పటికి సగటు వర్షపాతంలో సగమే నమోదైంది. ఇకమీదట అయినా రుతుపవనాలు బలపడి వర్షపాతం మెరుగుపడుతుందా? అంటే అంత సానుకూల పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు నిపుణులు. రుతుపవనాలు ఇంకా దేశవ్యాప్త విస్తరణ పూర్తి కాలేదు. దేశం మొత్తం విస్తరించిన తర్వాత, సాగరంలో అల్ప పీడనాలు ఏర్పడితే ఆ ప్రభావంతో మంచి వర్షాలకు అవకాశం ఉండొచ్చంటున్నారు.
ఎల్ నినో కేవలం వర్షాలపైనే కాకుండా, రానున్న శీతాకాలంపైనా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఖరీఫ్, రబీ పంటలపై దీని ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు రానున్న వేసవి సీజన్ మండిపోవచ్చన్న అంచనా వినిపిస్తోంది. శీతాకాలం వర్షాలపై ఎల్ నినో ప్రభావం పడుతుందని భారత వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ డీఎస్ పాయ్ తెలిపారు. రబీ పంటలైన గోధుమ, చానా, ఆవాలకు శీతాకాలంలో పడే వర్షాలు కీలకం. ఎల్ నినో పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయని, ఇవి క్రమంగా బలపడతాయని అమెరికా ప్రభుత్వ వాతావరణ అంచనా కేంద్రం కూడా తెలిపింది.
భాతర వాతావరణ శాఖ క్రితం అంచనాలో ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ 96 శాతం వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. దీనికి 4 శాతం ఎక్కువ, తక్కువ ఉండొచ్చని పేర్కొంది. అయితే, అంచనా కంటే 4 శాతం తక్కువలోనే ఉండొచ్చని తాజాగా పాయ్ వెల్లడించారు. వచ్చే వేసవి సీజన్ పైనా ఎల్ నినో ప్రభావం ఉంటుందన్నారు.