ICC Rankings: టెస్టుల్లో కేన్ మామకు రెండో స్థానం.. ఆడకున్నా మెరుగైన ర్యాంకు!
- టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ
- యాషెస్ తొలి టెస్టులో సెంచరీతో అగ్రస్థానంలోకి జో రూట్
- నంబర్ వన్ నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయిన లబుషేన్
- అనూహ్యంగా రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి కేన్ విలియమ్సన్
- ఆట ఆడకున్నా రిషబ్ పంత్ స్థానం ‘పది’లం!
- టెస్టు బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలోనే అశ్విన్
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. 887 పాయింట్లతో తొలి ర్యాంక్ ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మార్నస్ లబుషేన్ (877 పాయింట్లు) రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ట్రావిస్ హెడ్ (873 పాయింట్లు) కూడా ఒక స్థానం కిందికి దిగి నాలుగుకు చేరాడు.
అయితే ఐపీఎల్ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న కేన్ విలియమ్సన్ మాత్రం అనూహ్యంగా రెండుస్థానాలు ఎగబాకాడు. 883 పాయింట్లతో రెండో ర్యాంక్‌లోకి వచ్చాడు. ఇక టీమిండియా నుంచి పదో ర్యాంక్‌తో రిషభ్ పంత్ (758 పాయింట్లు) టాప్ -10లో ఉన్నాడు. గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా.. అతడి ర్యాంకు మారలేదు. ఇక ఇంగ్లాండ్‌పై ఆసీస్ తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ ఖవాజా 836 పాయింట్లతో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని ఏడో స్థానంలోకి దూసుకొచ్చాడు.
మరోవైపు టెస్టు బౌలర్ల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (860) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ (802 పాయింట్లు), ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ (799) ఒక్కో ర్యాంకును మెరుగుపర్చుకుని వరుసగా ఐదు, ఆరు స్థానాల్లోకి వచ్చారు. భారత ఆటగాడు రవీంద్ర జడేజా బౌలర్ల తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో జడేజా కొనసాగుతున్నాడు.