Tamil Nadu: దళితుల డ్రైనేజీ వాటర్ ఊరిలో నుంచి వెళ్లకూడదట.. తమిళనాడులో డ్రైనేజీ నిర్మాణాన్ని అడ్డుకున్న అగ్రవర్ణాలు
- కోయంబత్తూరు సమీపంలోని గ్రామంలో ఉద్రిక్తతలు
- బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
- డ్రైనేజీ నిర్మాణానికి ససేమిరా అంటున్న ఊరి జనం
తమిళనాడులోని ఓ గ్రామంలో ఇప్పటికీ దళితులను అంటరానివాళ్లుగానే చూస్తున్నారు. గ్రామంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ వివక్ష ఎక్కడిదాకా దారితీసిందంటే.. ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని కూడా అడ్డుకునేంత వరకూ వెళ్లింది. గ్రామంలో పరిశుభ్రత కోసం నిర్మించ తలపెట్టిన డ్రైనేజీని అగ్రవర్ణాలకు చెందిన జనం అడ్డుకున్నారు. దళితుల డ్రైనేజీ వాటర్ ఊళ్లోకి రావడానికి ఒప్పుకోబోమంటూ కొత్తగా కడుతున్న డ్రైనేజీని కూల్చేశారు. దీంతో కోయంబత్తూరు జిల్లాలోని ఉత్తరపాళ్యం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
ఉత్తరపాళ్యం పంచాయతీ అధికారులు గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం తలపెట్టారు. ఈ పనుల్లో భాగంగా గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థకు కొత్తగా మరో డ్రైనేజీని అనుసంధానించే పనులు మొదలుపెట్టారు. గ్రామం చివర ఉన్న ఆది ద్రావిడర్ కాలనీ నుంచి చేపట్టిన ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని గ్రామంలోని అగ్రవర్ణాల జనం అడ్డుకున్నారు. దళితుల డ్రైనేజీ వాటర్ ఊళ్లోకి ఎలా తీసుకొస్తారంటూ అధికారులను నిలదీయడంతో పాటు పనులు ఆపేయాలని హెచ్చరించారు. ఇప్పటికే కొంతమేర కట్టిన డ్రైనేజీని యువకులు కూల్చేశారు.
ఈ ఘటనపై పంచాయతీ అధికారులు స్పందిస్తూ.. దళితుల డ్రైనేజీ వాటర్ తమ ఇళ్ల ముందుకు రావడానికి అగ్రవర్ణాల జనం ససేమిరా అంటున్నారని, గ్రామ పరిశుభ్రత కోసం చేపట్టిన ఈ పనులను అడ్డుకుంటున్నారని చెప్పారు. గత్యంతరం లేక గ్రామంలోని వాటర్ ట్యాంక్ కు దగ్గర్లో ఓ పెద్ద గొయ్యి తవ్వి డ్రైనేజీ వాటర్ ను అటువైపు మళ్లించామని వివరించారు. దీనికి కూడా అగ్రవర్ణాల ప్రజలు అభ్యంతరం తెలిపారని, ఈ మురుగు నీరు మంచినీటితో కలిసే అవకాశం ఉందని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా.. బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.