Prabhas: 'ఆదిపురుష్' మేకర్స్ ను తగలబెట్టాలి: 'మహాభారత్' భీష్ముడి ఆగ్రహం

Mahabharat Bhishma Mukhesh Khanna fires on Adipurush makers
  • పౌరాణిక గ్రంథాలను అవమానించే హక్కును వీరికి ఎవరిచ్చారన్న ముఖేశ్ ఖన్నా
  • ఈ సినిమా మేకర్స్ ను క్షమించకూడదని వ్యాఖ్య
  • హనుమంతుడి నుంచి అభ్యంతరకరమైన డైలాగులు చెప్పించారని మండిపాటు
ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్'పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని, డైలాగులు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఎంతోమంది విమర్శిస్తున్నారు. తాజాగా గతంలో దేశాన్ని ఉర్రూతలూగించిన 'మహాభారత్' సీరియల్ లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా కూడా ఈ సినిమా మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మన పౌరాణిక గ్రంథాలను అవమానపరిచే హక్కును వీరికి ఎవరిచ్చారని ముఖేశ్ అన్నారు. రామాయణాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. రావణుడికి ఏం వరాలు ఉన్నాయో కూడా వీరికి తెలియదని అన్నారు. హిరణ్యకశిపుడిని కాపీ కొట్టి రావణుడికి అతికించారని విమర్శించారు. రాముడికి శివుడి ఆశీస్సులు ఉన్నాయని, ఈ విషయం కూడా వీరికి తెలియదని చెప్పారు. ఈ సినిమా మేకర్స్ ను క్షమించకూడదని అన్నారు. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వీరిని నిలబెట్టి తగలబెట్టాలని చెప్పారు. 

ఈ చిత్రం డైలాగ్ రైటర్ మనోజ్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పుడు సిగ్గుపడాల్సింది పోయి... బయటకు వచ్చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సనాతన ధర్మం కోసం ఈ చిత్రాన్ని నిర్మించామని చెపుతున్నారని... మీ సనాతన ధర్మం అందరి సనాతన ధర్మానికి విరుద్ధమైనదా? అని ప్రశ్నించారు. హనుమంతుడి నుంచి అభ్యంతరకరమైన డైలాగులు చెప్పించారని అన్నారు. రాముడు, కృష్ణుడు, విష్ణువులకు మీసాలు ఉండవని... వీరిని ఇలాగే చూస్తూ అందరం పెరిగామని... అలాంటి రాముడి స్వరూపాన్నే మార్చేశారని విమర్శించారు. హిందూ మతాన్ని కామెడీ చేశారని మండిపడ్డారు.
Prabhas
Adipurush
Mahabharat
Mukhesh Khanna
Tollywood
Bollywood

More Telugu News