Robo Cops: సింగపూర్ పోలీస్ శాఖలో రోబో కాప్ లు
- టెక్నాలజీని మరింతగా వినియోగించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం
- పోలీస్ శాఖలోకి తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలు
- గత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్
- తొలుత చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా, రోబోలు అన్ని పనులు చేస్తూ మానవ వనరులకు కొంతమేర ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఎంతో కీలకమైన సర్జరీలు సైతం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ రోబోలను ప్రవేశపెట్టింది. నగరంలో పెట్రోలింగ్ విధుల్లో ఈ రోబోలు పాలుపంచుకుంటున్నాయి.
ఇదే రీతిలో సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోబోలకు కెమెరాలు, సెన్సర్లు, సైరన్లు అమర్చుతారు.
గత ఐదేళ్లుగా సింగపూర్ లో ఈ పోలీస్ రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ఒక్కోసారి పోలీసులు ప్రాణాలకు తెగించి ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ రోబోలు కీలకపాత్ర పోషించనున్నాయి.
ఈ రోబోల్లో స్పీకర్లు కూడా అమర్చి ఉంటాయి. ప్రజలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో ఈ రోబోలకు ఉన్న స్పీకర్ల ద్వారా పోలీసులు సంభాషించవచ్చు, ప్రజలకు సూచనలు పంపవచ్చు. అంతేకాదు, ఈ రోబోలకే మైక్రోఫోన్లు అమర్చి ఉంటాయి. వీటి ద్వారా ప్రజలు పోలీసు అధికారులతో మాట్లాడవచ్చు, తమ పరిస్థితిని వారికి తెలియజేయవచ్చు.
కాగా, ఈ రోబో పోలీస్ సేవలను సింగపూర్ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో మొదటగా వినియోగించనుంది.