Pawan Kalyan: కాపులంతా అందుకే పవన్ కల్యాణ్‌ను ఛీకొడుతున్నారు: జోగి రమేశ్

Jogi Ramesh targets Pawan and Chandrababu

  • చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శ
  • చనిపోయిన వారి ఇంటికెళ్లి ఓట్లు అడుక్కునే దుస్థితి దారుణమని ఆగ్రహం
  • 175 సీట్లలో చంద్రబాబుకు అభ్యర్థులు ఉన్నారా? అని ఎద్దేవా
  • బాబు విదిల్చే కాసులకు పవన్ కల్యాణ్ కక్కుర్తు పడాలా? అన్న జోగి
  • ముద్రగడ రాసిన లేఖ చూస్తే రాజకీయాలు వదిలేస్తాడని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు శవాలపై రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని, ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమర్నాథ్ ఘటన విషయం తెలియగానే సీఎం జగన్ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. అలాగే నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేశామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులకు త్వరగా శిక్షపడేలా చేస్తామన్నారు. కానీ చంద్రబాబు పరామర్శ పేరుతో డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

చంద్రబాబుకు శవరాజకీయాలు అలవాటేనని, కులాలను రెచ్చగొడుతున్నారన్నారు. శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కునే దుస్థితి దారుణమన్నారు. అలాంటి పరిస్థితిలో వారి ఇంటికి వెళ్లి ఓట్లు అడగడమా? తనకు అండగా ఉండాలని అడగటమా? సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు పనికిమాలిన రాజకీయాలు చేస్తుంటే, అమర్నాథ్ తల్లి తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారన్నారు.

చంద్రబాబు పొర్లుదండాలు పెట్టినా బీసీలు టీడీపీకి ఓటు వేయరన్నారు. 175 సీట్లలో గెలుస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అసలు అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. అంతమంది అభ్యర్థులు ఉన్నారా? అన్నారు. వంగవీటి రంగా హత్యకు చంద్రబాబు కారణమని చేగొండి హరిరామజోగయ్య అన్నారని, ఈ విషయం ప్రపంచానికి తెలుసు అన్నారు.

అలాంటి పార్టీకి ఓటు వేయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా అడుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదిల్చే కాసులకు కక్కుర్తిపడి టీడీపీకి ఓటేయమని చెప్పాలా? అని ప్రశ్నించారు. అందుకే కాపులు పవన్ ను ఛీకొడుతున్నారన్నారు. ముద్రగడ రాసిన లేఖని చూస్తే పవన్ రాజకీయాలు వదిలేసి పారిపోతాడన్నారు. సినిమాలు లేక ఇక్కడకు వచ్చి, రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదువుతున్నాడన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News