: 'గుంతల' బిల్లు చూసి అవాక్కయిన అధికారులు!
పెట్టింది పిసరంత, కొట్టేసింది కొండంత అన్నట్టుంది ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నిర్వాకం. తవ్వింది నాలుగు గుంతలైతే, బిల్లులు మాత్రం నలభై కోట్లకు పెట్టేశాడా కాంట్రాక్టరు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అమ్మో ఇంత బిల్లా? అంటూ గుండెలు బాదేసుకుని చెల్లింపు ఆపేశారు. ఈ వివరాల్లోకి వెళితే, పలు వివాదాల నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ట్రాన్స్ ట్రాయ్ కు అప్పగించింది ప్రభుత్వం. సదరు కంపెనీ భూమి పూజ చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నది నీటిని మళ్లించడానికి 'స్పిల్ వే'ను తవ్వాల్సి ఉంది.
అందుకోసం రెండున్నర కిలో మీటర్ల మేర కొండలను తవ్వాలి. దీంతో ఆ ప్రాంతంలో కొన్ని గుంతలను తవ్వి, మట్టి వెలికితీసినట్టు ఒక బిల్లు 22 కోట్ల రూపాయలకు, మరో బిల్లు 18 కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్ ప్రభుత్వాధికారులకు సమర్పించారు. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు గుంతలకు బిల్లులు చెల్లించడం కుదరదని, కనీసం 200 మీటర్ల మేర కొండలను తవ్వి మట్టి తీయాల్సి ఉంటుందని, అప్పుడే బిల్లు చెల్లించగలమని స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్నారు సదరు కాంట్రాక్టరు!