Ajit Pawar: కేసీఆర్ సక్సెస్ కాలేరు: ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ విమర్శలు
- మహారాష్ట్రలో పార్టీలను విస్తరించాలని మాయావతి, ములాయం సింగ్ యత్నించారన్న అజిత్
- ఇద్దరూ కూడా సక్సెస్ కాలేకపోయారని వ్యాఖ్య
- కేసీఆర్ కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్న
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తొలి విడతలో భాగంగా ఆయన మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో దృష్టిని సారించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు భారీ బహిరంగ సభలను నిర్వహించారు. పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పలువురు మహారాష్ట్ర నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని... కానీ, ఆయన సక్సెస్ కాలేరని అజిత్ పవార్ చెప్పారు. పూణెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే మహారాష్ట్రలోకి అడుగుపెట్టేందుకు మాయావతి, ములాయం సింగ్ వంటి నేతలు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. మాయావతి, ములాయం సింగ్ లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో వారి పార్టీలను విస్తరించాలని విశ్వప్రయత్నం చేశారని... కానీ ఆశించిన స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారని అన్నారు.
జాతీయ స్థాయి నాయకుడు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని... అందుకే ఆయన తెలంగాణ వెలుపల కూడా పార్టీని విస్తరించే పనిలో ఉన్నారని అజిత్ చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాల కోసం హోర్డింగులు, అడ్వర్టైజ్ మెంట్లు, బ్యానర్లు, టీవీ యాడ్లకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బంతా కేసీఆర్ కు ఎక్కడ నుంచి వస్తోందనే విషయం గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు.