ahmadabad: ఫోన్ తీసేసుకుందని తల్లిని చంపాలని ప్రయత్నించిన 13 ఏళ్ల బాలిక!
- డయల్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి పరిష్కారం కోరిన తల్లి
- కరోనా తర్వాత ఫోన్ అడిక్ట్ కేసులు పెరిగాయన్న కౌన్సిలర్లు
- ఏడాదికి 5,400 వరకు కేసులు నమోదవుతున్నాయని వెల్లడి
కరోనా తర్వాత చాలామంది పిల్లలు ఫోన్ కు బానిసయ్యారు. అహ్మదాబాద్ లో అయితే ఓ 13 ఏళ్ల బాలిక ఫోన్ కోసం ఏకంగా తన తల్లినే చంపేందుకు ప్రయత్నాలు చేసిన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ అహ్మదాబాద్ లో ఉండే 45 ఏళ్ల కోమల్ పర్మార్ (పేరు మార్చబడింది) తన ఇంట్లోని పంచదార డబ్బాలో పురుగుల మందును గుర్తించి ఆశ్చర్యపోయింది. షుగర్ కంటైనర్ లో పురుగుల మందు ఎవరు పెట్టారా అని ఆరా తీయగా తన 13 ఏళ్ల కూతురు ఈ పనికి కారణమని నమ్మలేకపోయింది. దీంతో ఆ తల్లి అహ్మదాబాద్ లోని డయల్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి, పరిష్కారం కోరింది.
ఆ కూతురు నుండి పూర్తి సమాచారం ఆరాతీయగా తేలిందేమంటే.. ఆ తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకపోవడంతో కూతురు... తల్లికి హాని చేయాలనే నిర్ణయానికి వచ్చింది. 'ఆ పాప తన తల్లిదండ్రులకు చక్కెరలో పురుగుల మందు కలిపి తినేలా చేయాలని భావించిందని, అలా కాకుంటే కింద జారిపడేలా చేయడం ద్వారా హాని చేయాలని నిర్ణయించుకుందని అభయం 181 వుమెన్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ తెలిపారు. తల్లి ఆ పాప నుండి కొన్ని రోజుల క్రితం ఫోన్ లాక్కుందని, ఫోన్ చూడనిచ్చేది కాదని, దీంతో ఆ పాప తల్లిపై క్రూరంగా ఆలోచించిందని కౌన్సిలర్ చెప్పారు.
తమ పాప నిత్యం ఫోన్ లో మునిగిపోతోందని, రాత్రుళ్లు కూడా బాగా చూస్తోందని, స్నేహితులతో చాటింగ్ చేస్తోందని, సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు చూస్తోందని, ఫోన్ కు బానిస కావడం ఆమె ఆరోగ్యం, చదువులపై ప్రభావం చూపిందని ఆ తల్లిదండ్రులు తమకు చెప్పారని కౌన్సిలర్ తెలిపారు.
వీరికి పెళ్లైన పదమూడేళ్ల తర్వాత ఆ పాప పుట్టిందని, దీంతో అల్లారుముద్దుగా చూసుకున్నారని, ఆమెకు ఏం కావాలంటే అది ఇచ్చారని, కానీ ఫోన్ కు బానిస కావడం, ఆ తర్వాత తమనే అంతమొందించాలని చూడటాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.
అయితే ఇది ఈ ఒక్క కేసులోనే జరగలేదని, 2020 తర్వాత లేదా కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు భారీగా పెరిగాయని అభయం హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ ఫల్గుణి పటేల్ చెప్పారు. కరోనాకు ముందు ఇలాంటి కేసులు రోజుకు 3 లేదా నాలుగు మాత్రమే తమ వద్దకు వచ్చేవని, గత రెండేళ్లుగా ఈ సంఖ్య 12 నుండి 15కు పెరిగిందన్నారు. ఏడాదికి 5,400 వరకు ఇలాంటి కేసులు వస్తున్నట్లు చెప్పారు. తమ వద్దకు వస్తున్న కేసుల్లో 20 శాతం 18 ఏళ్ల లోపువే ఉంటున్నాయన్నారు.