Daku Haseena: కక్కుర్తే పట్టించింది.. రూ. 8.5 కోట్లు కొట్టేసి.. ఫ్రీ డ్రింక్ కు దొరికిపోయింది.. ఇదీ కథ!
- పంజాబ్‌లోని లూథియానాలో రూ.8.49 కోట్ల దోపిడీ చేసిన మన్‌దీప్ కౌర్
- పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భర్తతో కలిసి నేపాల్‌కు పయనం
- మార్గమధ్యంలో పుణ్యక్షేత్రాలు చూసేందుకు వెళ్లిన జంట
- ఆమెను పట్టుకునేందుకు ‘ఫ్రీ డ్రింక్’ ప్లాన్ అమలు చేసిన పోలీసులు
- హేమ్‌కుండ్ సాహెబ్ లో దర్శనం చేసుకున్నాక అరెస్టు
ఆమె ఓ గజ దొంగ.. ఇటీవల 8.5 కోట్లను దోచుకుంది.. పోలీసులకు చిక్కుకుండా తప్పించుకు తిరుగుతోంది.. అన్ని కోట్లు దోచుకున్నా రూ.10 కూల్‌డ్రింక్‌కు కక్కుర్తిపడింది.. చివరికి పోలీసులకు దొరికిపోయింది.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. ఇంతకీ ఎవరా దొంగ..? ఏమా కథ?
పంజాబ్‌లోని లూథియానాలో ఈ నెల 10న సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అనే సంస్థలో రూ.8.49 కోట్ల విలువైన సొమ్మును ‘డాకూ హసీనా’గా పేరున్న మన్‌దీప్ కౌర్ దోచుకొంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నేపాల్‌కు తన భర్త జస్వీందర్ సింగ్‌తో కలిసి బయల్దేరింది. దోపిడీ విజయవంతమైందనే సంతోషంలో మార్గమధ్యంలో పుణ్యక్షేత్రాలు చూసేందుకు వెళ్లింది.
ఇటు పోలీసులు తమ దర్యాప్తును తీవ్రం చేశారు. మన్ దీప్ సహచరుడు గౌరవ్‌ను అరెస్టు చేసి కీలక వివరాలు రాబట్టారు. మొత్తం కేసుకు సంబంధించిన 12 మందిలో 9 మందిని అరెస్టు చేశారు. రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో మన్‌దీప్-జస్వీందర్ జంట నేపాల్ వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది.
హరిద్వార్, కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహెబ్ క్షేత్రాలను కేడీ జంట దర్శించనున్నట్లు అధికారులకు సమాచారం అందింది. హేమ్‌కుండ్ సాహెబ్‌కు నిత్యం వేల మంది యాత్రికులు వస్తుంటారు. ఇంత మంది సిక్కు భక్తుల్లో మన్‌దీప్‌ను గుర్తించడం కష్టం. దీంతో యాత్రికులకు ఉచితంగా డ్రింక్ పంపిణీ ప్రణాళికను పోలీసులు అమలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లుగానే ఉచిత డ్రింకును తీసుకోవడానికి మన్‌దీప్ జంట ఆ స్టాల్ వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లే సమయానికి ఈ జంట తమ ముఖాలు కనిపించకుండా కవర్ చేసుకున్నారు. కానీ డ్రింక్ తాగేందుకు వారు ముఖంపై ఉన్న వస్త్రాన్ని తొలగించడంతో పోలీసులు వారిని గుర్తించారు. అయినా.. పోలీసులు ఏమీ తెలియనట్లు నటించారు.
హేమ్‌కుండ్ సాహెబ్‌లో వారు ప్రార్థనలు చేసుకునే దాకా ఎదురుచూశారు. బయటికి రాగానే వెంటపడి పట్టుకొన్నారు. ఈ ఆపరేషన్‌కు పోలీసులు ‘లెట్స్ క్యాచ్ క్వీన్ బీ’ (రాణీ తేనెటీగను పట్టుకొందాం) అని పేరు పెట్టారు. మన్‌దీప్ వద్ద నుంచి రూ.12 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనం, ఆమె భర్త జస్వీందర్ సింగ్ నుంచి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు.
గతంలో బీమా ఏజెంట్‌గా పనిచేసిన మన్‌దీప్ భారీగా అప్పులు చేసింది. ఫిబ్రవరిలో జస్వీందర్‌ను పెళ్లి చేసుకొంది. సంపన్నురాలిగా మారదామనే ఉద్దేశంతోనే ఆమె సీఎంఎస్ సంస్థలో ఉద్యోగులను బందీలుగా చేసుకొని ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.