Delhi police: డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ల పేరుతో రూ.160 కోట్లు కాజేసిన నేరగాళ్లు
- అమెరికన్లను దోచుకున్న సైబర్ ముఠా.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు
- ఎఫ్ బీఐ, ఇంటర్ పోల్ సహకారంతో నిందితుల అరెస్ట్
- కేసుల పేరుతో బెదిరిస్తూ లక్షల డాలర్లు వసూలు
అమెరికన్లను ఫోన్ ద్వారా బెదిరిస్తూ భారీ మొత్తంలో డాలర్లు కొల్లగొట్టిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఇలా పలువురు అమెరికన్ల నుంచి 20 మిలియన్ డాలర్ల (రూ.160 కోట్లు) ను ఈ ముఠా సభ్యులు కాజేశారని తెలిపారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ), ఇంటర్ పోల్ సాయంతో నిందితులను గుర్తించి, అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలు, ఉగాండా, కెనడాలో ఈ ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ ముఠాకు లీడర్ గా వ్యవహరిస్తున్న వత్సల్ మెహతాతో పాటు పార్థ్ ఆర్మార్కర్, దీపక్ అరోరా, ప్రశాంత్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉత్తమ్ ధిల్లాన్ పేరుతో ఈ ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా, డార్క్ నెట్, ఇతర సామాజిక మాధ్యమాలలో పెద్దగా యాక్టివ్ గా ఉండని సంపన్నులను గుర్తించి, వివిధ మార్గాల ద్వారా వారి వివరాలు సేకరించే వారని తెలిపారు. ఆపై వారికి ఉత్తమ్ ధిల్లాన్ పేరుతో ఫోన్ చేసేవారని చెప్పారు. ‘అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో చిన్నారుల అశ్లీల వీడియో ముఠా ఒకటి పట్టుబడిందని, వారి దగ్గర ఈ ఫోన్ నెంబర్ లభించిందని ముందుగా భయపెడతారు.. ఆ తర్వాత మొదటిసారి కాబట్టి జరిమానాతో సరిపెడుతున్నామని, జరిమానా చెల్లించకపోతే కోర్టు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తారు. బాధితుల ఆర్థిక స్తోమతను బట్టి లక్ష డాలర్లకు పైగా డిమాండ్ చేస్తారు’ అని చెప్పారు.
అమెరికాలో ఏ రాష్ట్రంలో ఉన్నాసరే బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారని వివరించారు. బాధితులు పైపైన ఎంక్వైరీ చేస్తే దొరికిపోకుండా ఉండేందుకు అమెరికా డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఉత్తమ్ ధిల్లాన్ పేరును వాడుకున్నారని వివరించారు. ఇలా పలువురు అమెరికన్లను బెదిరించి 20 మిలియన్ డాలర్లను కొల్లగొట్టారని పోలీసులు వివరించారు. ఎఫ్ బీఐ, ఇంటర్ పోల్ ద్వారా ఈ ముఠాకు సంబంధించిన సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.