Telangana: తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. ఇంట్లోనే ఉండాలంటూ వైద్యుల సూచన

IMD Issues orange alert for telangana

  • ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • సోమవారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం
  • మంచినీళ్లతో పాటు మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తాగాలని సూచన 

తెలంగాణలో సోమ, మంగళవారాలు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీలైనంత వరకు పగటిపూట బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించింది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక మంగళవారం 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించింది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు.

పగటిపూట బయటకు వెళ్లాల్సి వస్తే.. తలకు తప్పనిసరిగా క్లాత్ చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని, దాహం వేయకున్నా తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తపడాలని వైద్యులు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే ఉండడం ఉత్తమం. కూల్ డ్రింకుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తయారుచేసుకుని తరచూ తాగాలని చెప్పారు.

Telangana
IMD
Heatwave
temparature
hot summer
  • Loading...

More Telugu News