Biryani: రూపాయి నోటుకు బిర్యానీ అన్నారు... ఇక చూస్కోండి!

Biryani for only one rupee note

  • కరీంనగర్ లో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఆఫర్
  • ఎగబడిన జనాలు
  • నిలిచిన ట్రాఫిక్... రెస్టారెంట్ వద్ద ఉద్రిక్తత
  • జనాలను చెదరగొట్టి, రెస్టారెంట్ ను మూయించిన పోలీసులు

ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. సరుకుల ధరలు పెరగడంతో బిర్యానీ ధరలు కూడా పెరిగాయి. అయినప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న ఐటెంలలో బిర్యానీ ముందు వరుసలో ఉంటుంది. అలాంటిది, రూపాయికే బిర్యానీ అంటే జనాలు ఎలా పరుగులు తీసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

కరీంనగర్ లో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూపాయి నోటుకు బిర్యానీ ఇస్తామని ప్రకటించింది. దాంతో, కొంచెం కష్టమే అయిన్పటికీ పాత రూపాయి నోట్లు సాధించిన ప్రజానీకం, మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆ రెస్టారెంట్ వద్దకు పోటెత్తింది. 

మధ్యాహ్నం 2.30 గంటల తర్వాతే ఆఫర్ వర్తిస్తుందని రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించినా, జనం అంతకుముందే అక్కడికి భారీగా చేరుకున్నారు. వందల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేయడంతో అక్కడ ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

నిర్ణీత సమయం కంటే ముందే  అక్కడికి చేరుకున్న జనం ఎంతకీ బిర్యానీ అందించకపోవడంతో ఒక్కసారిగా రెస్టారెంట్ లోకి చొచ్చుకొని వెళ్లారు. దాంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని చెదరగొట్టారు. అంతేకాదు, ఈ రెస్టారెంట్ ను కూడా మూసివేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Biryani
One Rupee
Offer
Karimnagar
  • Loading...

More Telugu News