Akhilesh Yadav: బీజేపీని ఓడించేందుకు అఖిలేశ్ యాదవ్ సరికొత్త ఫార్ములా
- పీడీఏ ఫార్ములా బీజేపీని ఓడిస్తుందన్న అఖిలేశ్
- పెద్ద జాతీయ పార్టీలు మద్దతిస్తే యూపీలో 80 సీట్లు గెలువవచ్చని వ్యాఖ్య
- పొత్తులో సమాజ్ వాది పార్టీ ఎప్పుడు నిజాయతీగా ఉందన్న మాజీ సీఎం
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు యాదవ్ తన ఫార్ములాను వెల్లడించారు. PDA-పిచ్లే, దళిత్, అల్పసంఖ్యక్ (వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలు) - ఎన్డీయేను ఓడిస్తుందని పేర్కొన్నారు.
పెద్ద జాతీయ పార్టీలు మద్దతిస్తే యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూపీ, జాతీయ ఎన్నికల కోసం కాంగ్రెస్, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, తమ పార్టీ గతంలో పొత్తులు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాము ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా నిజాయతీగా వ్యవహరించామన్నారు.
సమాజ్ వాది పార్టీ ఎప్పుడు, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, సీట్ల విషయంలో గొడవ గురించి మీరు విని ఉండరని చెప్పారు. సీట్ల గురించి పట్టుబట్టలేదని చెప్పారు. యూపీలో 80 గెలుద్దాం... బీజేపీని తరిమేద్దాం అనే నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.