Fire Accident: తిరుపతిలో అగ్నిప్రమాదం... వదంతులు నమ్మవద్దన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy visits fire accident site in Tirupati
  • నేడు ఓ ఫొటో ఫ్రేమ్స్ దుకాణంలో అగ్నిప్రమాదం
  • భవనం మొత్తానికి వ్యాపించిన మంటలు
  • పక్కనే గోవిందరాజస్వామి వారి రథం
  • ఇటీవల గోవిందరాజస్వామి ఆలయం వద్ద కూలిన వృక్షం
  • ఈ వరుస ఘటనలపై రకరాలుగా ప్రచారం చేస్తున్నారన్న ధర్మారెడ్డి
తిరుపతి నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఫొటో ఫ్రేమ్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. భవనం మొత్తానికి అంటుకున్న మంటలు పక్కనే ఉన్న గోవిందరాజస్వామి ఆలయ రథం వరకు వ్యాపించాయి. దాంతో మాడ వీధుల్లో రాకపోకలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పలు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. 

ఇటీవల గోవిందరాజస్వామి ఆలయంలో ఈదురుగాలులకు భారీ వృక్షం కూలిపోవడంతో కడపకు చెందిన ఓ వైద్యుడు మృతి చెందాడు. ఇవాళ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోనే అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై వదంతుల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 

మొన్న ఆలయం వద్ద వృక్షం కూలిపోవడం, నేడు అగ్నిప్రమాదం జరగడంపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని, గోవిందరాజస్వామి వారి రథం దెబ్బతిన్నట్టు పుకార్లు పుట్టించారని ధర్మారెడ్డి వెల్లడించారు. ఇలాంటి ప్రచారాలను భక్తులు నమ్మవద్దని సూచించారు. 

ఇవాళ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ధర్మారెడ్డి గోవిందరాజ స్వామి ఆలయం వద్దకు వచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గోవిందరాజస్వామి వారి రథానికి ఎలాంటి ప్రమాదం లేదని, మంటలు అంటుకోలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి రథం దూరంగా ఉందని వెల్లడించారు.
Fire Accident
Tirupati
Dharma Reddy
TTD EO
Govindaraja Swamy Temple

More Telugu News