AP DGP: కిడ్నాపర్లు ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను కట్టేసి.. రూ.1.75 కోట్లను వసూలు చేశారు: డీజీపీ

dgp rajendranath reddy press meet about vizag kidnap case
  • ఎంపీ ఎంవీవీ కొడుకు శరత్‌ను కట్టేసి కత్తితో బెదిరించారన్న డీజీపీ
  • కిడ్నాప్‌ గురించి తెలియగానే గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని వెల్లడి
  • నిందితులు హేమంత్‌, రాజేశ్‌, సాయి నుంచి రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్న డీజీపీ
  • ఈ ఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్య
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్లు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. నిందితులను హేమంత్‌, రాజేశ్‌, సాయిని పట్టుకున్నామని, వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామని చెప్పారు. కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ రోజు మీడియాకు డీజీపీ వెల్లడించారు. 

‘‘ముగ్గురు నిందితులు హేమంత్‌, రాజేశ్‌, సాయి.. ఎంపీ కుమారుడు శరత్‌ ఇంట్లోకి వెళ్లి బెదిరించారు. శరత్‌ను ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్‌తో పిలిపించారు. తర్వాత ఆమెను కూడా కట్టేశారు. ఆడిటర్‌ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు’’ అని డీజీపీ తెలిపారు. 

శరత్ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు తీసుకున్నారని, మరో రూ.60 లక్షలను ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఆడిటర్ జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారని వివరించారు. కిడ్నాప్‌ గురించిన సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని తెలిపారు. 

‘‘కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. అప్పటివరకు బాధితులను కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలిసి.. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్‌ జీవీతో పాటు కారులో పరారయ్యేందుకు యత్నించారు’’ అని తెలిపారు. వారిని పోలీసులు ఛేజ్‌ చేశారన్నారు.

పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు ఆగిపోవడంతో.. ముగ్గురు బాధితులను అక్కడే వదిలేసి కిడ్నాపర్లు పరారయ్యారని డీజీపీ తెలిపారు. తర్వాత వాళ్లను పట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని వస్తున్న వార్తలను డీజీపీ ఖండించారు. ఈ ఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకొచ్చారు.
AP DGP
rajendranath reddy
MVV Satyanarayana
vizag kidnap case

More Telugu News