Telangana: కదలని నైరుతి.. ‘తొలకరి పలకరింపు’ మరింత ఆలస్యం

Monsoon delayed in Telangana

  • ఏపీలోనే నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు
  • ఎల్‌నినో, బిపోర్‌జాయ్ తుపానుతో నైరుతి కదలికలపై ప్రతికూల ప్రభావం
  • ఈ నెల 19 తరువాతే రుతుపవనాల గమనంపై స్పష్టత వస్తుందన్న వాతావరణ శాఖ
  • తొలకరి పలకరింపు లేక రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రీష్మతాపం

తెలంగాణను రుతుపవనాలు పలకరించేందుకు మరింత సమయం పట్టేటట్టు ఉంది. జూన్ 10వ తేదీనే రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉన్నా ప్రతికూల పరిస్థితుల కారణంగా అవి ఏపీలోనే స్తంభించిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11న రుతుపవనాలు ఏపీ సరిహద్దును తాకాయి. ఆ తరువాత కర్ణాటక అంతా వ్యాపించాల్సి ఉన్నా అక్కడే నిలిచిపోయాయి. అయితే, 19 తరువాత రుతుపవనాల తీరుతెన్నులపై స్పష్టమైన అంచనాకు రాగలమని, తెలంగాణకు ‘తొలకరి’ ఎప్పుడో ఆ తరువాతే చెప్పగలమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

పసిఫిక్ మహా సముద్రం నుంచి వీచే గాలులు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర వాతావరణంపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినోతో గాలికదలికలు నెమ్మదిస్తాయని వెల్లడించారు. దీనికి తోడు గుజరాత్ తుపాన్ కారణంగా తేమతో నిండిన గాలులు అటువైపు మళ్లడంతో తొలకరి పలకరింపు ఆలస్యమవుతోందని చెప్పారు. 

నైరుతి రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో గ్రీష్మతాపం కొనసాగుతోంది. జూన్ రెండో వారం ముగుస్తున్నా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. శుక్ర, శనివారాల్లో 16 జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News