YS Sharmila: సీఎం కేసీఆర్ ను వైరస్ తో పోల్చిన షర్మిల

YS Sharmila compares CM KCR with virus

  • కేసీఆర్ కరోనాను మించిన వైరస్ అని పేర్కొన్న షర్మిల
  • కేసీఆర్ ను మించిన వైరస్ ఇంకేదీ రాదని విమర్శలు
  • నిమ్స్ విస్తరణకు కొబ్బరికాయ కొట్టిన కేసీఆర్ గత శంకుస్థాపనల సంగతి చెప్పాలని డిమాండ్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ ను అత్యంత ప్రమాదకర వైరస్ తో పోల్చారు. కరోనాను మించిన వైరస్ లు వస్తాయని జోస్యం చెప్పే దొరా... తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే మీకంటే పెద్ద వైరస్ ఏదీ రాదులే అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టిపీడించే అతి పెద్ద వైరస్ అని అభివర్ణించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడానికి, ప్రజలను అప్పులపాలు చేయడానికి పుట్టిన వైరస్ మీరు అంటూ కేసీఆర్ ను విమర్శించారు. 

కరోనాతో పోరాడి నిలిచామేమో కానీ, ఈ బీఆర్ఎస్ వైరస్ బారినపడితే అంతే సంగతులు అని షర్మిల పేర్కొన్నారు. నిమ్స్ విస్తరణకు కొబ్బరికాయ కొట్టిన కేసీఆర్ గత శంకుస్థాపనల సంగతేంటో చెప్పాలని నిలదీశారు. 

"రూ.15 వందల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి కడతామని చెప్పారు... నగరం నాలుగు మూలలా నాలుగు పెద్దాసుపత్రులు కడతామన్నారు... ఎక్కడ ఆ ఆసుపత్రులు? కార్పొరేట్ వైద్యం ఏదీ... ఎయిమ్స్ ను మించిన ట్రీట్ మెంట్ కనపడడంలేదే" అంటూ షర్మిల ఎత్తిపొడిచారు. 

కొబ్బరికాయ కొట్టిన 14 నెలలైనా ఇంతవరకు పునాదిరాయి పడలేదని అన్నారు. దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదని, కమీషన్లకు కాళేశ్వరంపై పెట్టిన దృష్టి  వైద్యాభివృద్ధి మీద లేదని విమర్శించారు. 

కొబ్బరికాయలు, శంకుస్థాపనలు... ఇదే మీరు 10 ఏళ్లలో సాధించిన ఆరోగ్య తెలంగాణ అని షర్మిల ఎద్దేవా చేశారు. మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజెక్షన్ రెడీ అయ్యింది దొరగారూ అంటూ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News