Monsoon: 18 తర్వాత రుతుపవనాల్లో మరింత పురోగతి: ఐఎండీ

Monsoon likely to pick up pace starting June 18 says weather department

  • ఇప్పటి వరకు పెద్దగా లేని పురోగతి
  • దేశంలోని చాలా రాష్ట్రాలకు చేరుకోని రుతుపవనాలు
  • జూన్ 1 నుంచి చూస్తే చాలా ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు
  • 18 తర్వాత నుంచి విస్తరిస్తాయంటున్న వాతావరణ శాఖ

నైరుతి రుతువపనాలు జూన్ 8న కేరళను తాకి, వారం గడుస్తున్నప్పటికీ పెద్దగా వర్షాల్లేవు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, అది బిపర్ జాయ్ తుపాను ప్రభావంగా నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, విస్తరణ నిదానంగా ఉంటుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు అయితే రుతుపవనాల విస్తరణలో పెద్దగా పురోగతి కూడా లేదు. జూన్ 11 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. జూన్ 18 తర్వాతే రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

‘‘బిపర్ జాయ్ రుతు పవనాలకు మొదట్లో సాయపడింది. తుపాను ప్రభావంతో దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళానికి పవనాలు బలపడ్డాయి. తుపాను చాలా నిదానంగా కదలడంతో రుతుపవనాల విస్తరణకు సాయంగా నిలిచింది’’ అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.

‘‘ఇప్పుడు రుతువపనాల విస్తరణ నుంచి తుపాను ప్రభావం వేరు పడింది. జూన్ 18 వరకు తుపాను ప్రభావం రుతుపవనాలపై ప్రతికూలంగా ఉంటుంది. 18 తర్వాత రుతుపవనాల విస్తరణ బలపడుతుంది. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు జూన్ 21 నాటికి రుతుపవనాలు చేరుకుంటాయి. 

‘‘జూన్ చివరి నాటికి రుతుపవనాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. అప్పటి వరకు మధ్య, ఉత్తర భారత్ లో తగినన్ని వర్షాలు ఉండకపోవచ్చు’’ అని ఎర్త్ సైన్స్ శాఖ మాజీ సెక్రటరీ ఎం రాజీవన్ పేర్కొన్నారు.  

"రుతువపనాల్లో ఎలాంటి పురోగతి లేదు. మూడు నాలుగు రోజుల్లో ఇవి పుంజుకోవచ్చు. 20, 21 నాటికి ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. మధ్య భారత్, వాయవ్య భారత్ ప్రాంతాలకు చేరుకునేందుకు మరింత సమయం వేచి చూడక తప్పదు’’ అని ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్ వెదర్ పేర్కొంది. జూన్ పై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని ఈ సంస్థ అభిప్రాయపడింది. 

జూన్ 1 నుంచి చూస్తే ఇప్పటి వరకు దక్షిణ భారత్ లో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మధ్య భారత్ లో 73 శాతం, వాయవ్య భారత్ లో 20 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 48 శాతం మేర లోటు కనిపిస్తోందని ఐఎండీ పేర్కొంది. ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది రుతుపవనాలపై ఉంటుందన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతుండగా.. సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News