Bihar: ముంబై మోడల్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్
- బీహార్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
- 2021 నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మోడల్ ఆరోపణ
- విషయం బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరిక
ముంబై మోడల్‌పై అత్యాచారానికి పాల్పడి ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్న నిందితుడిని బీహార్‌లో అరెస్ట్ చేశారు. రాంచీకి చెందిన నిందితుడు తన్వీర్‌ఖాన్‌ను రెండు వారాల తర్వాత బీహార్‌లోని అరారియా జిల్లాలో బుధవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడతడిని రాంచీకి తరలించనున్నారు. తన్వీర్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తర్వాత ఈ కేసును రాంచీకి బదిలీ చేశారు.
బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన బాధిత మోడల్ మోడలింగ్ వర్క్‌షాప్ కోసం రాంచీ వచ్చింది. అక్కడామెకు పరిచయమైన నిందితుడు 2021 నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను హెచ్చరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
ఈ ఆరోపణలను తన్వీర్ ఖండించాడు. ఆమె తన ఏజెన్సీలో పనిచేసిందని, ఈ క్రమంలో నష్టపోయిన తాను పరిహారం అడగడంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.