India: భారత్‌ను వీడుతున్న అపరకుబేరులు.. ఈ ఏడాది ఏకంగా 6500 మంది!
- హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో వెల్లడి
- సంక్షిష్ట పన్ను చట్టాలు, విదేశీ పెట్టుబడుల నిబంధనలే సంపన్నుల వలసలకు కారణం
- దుబాయ్, సింగపూర్ నగరాలకు క్యూ కడుతున్న సంపన్న భారతీయులు
- ఈ రిపోర్టులో మొదటి స్థానంలో నిలిచిన చైనా
భారతీయ అపరకుబేరులు దేశాన్ని వీడుతున్నారు. ఈ ఏడాది 6,500 మంది హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (సంపన్నులు) భారత్‌ను వీడే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో తాజాగా వెల్లడైంది. సంపన్నుల వలసల్లో చైనా తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 13,500 మంది సంపన్న చైనీయులు దేశాన్ని వీడుతారని ఈ నివేదిక తేల్చింది.
ఈ రిపోర్టులో భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ విభాగం హెడ్ ఆండ్రూ మోలిస్ పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిపోతున్న భారతీయ సంపన్నుల కంటే ఎక్కవ సంఖ్యలో కొత్త మిలియనీర్లు దేశంలో పుట్టుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టగలిగిన సంపన్నులను హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ అని పిలుస్తారు.
కాగా, భారత్‌లోని సంక్లిష్ట పన్ను చట్టాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి అస్పష్టమైన విధానాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉండటంతో భారతీయ సంపన్నులు విదేశాలకు తరలిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వీరిలో అధికశాతం మంది దుబాయ్, సింగపూర్‌కు వెళుతున్నట్టు తేలింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది వివిధ దేశాల సంపన్నులు ఆస్ట్రేలియాకు క్యూ కట్టే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు పేర్కొంది.