Pawan Kalyan: సీఎం పదవిపై కత్తిపూడి సభలో క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on CM Post

  • పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో పవన్ సభ
  • విడిగా వస్తానో, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదన్న పవన్
  • ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతానని ప్రతిజ్ఞ
  • ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ సవాల్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం అన్నవరం క్షేత్రం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకర్గంలోని కత్తిపూడి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ వారాహి వాహనం పై నుంచి ప్రసంగించారు. 

చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ వారాహి యాత్ర చేస్తున్నాడన్న విమర్శలను, తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కత్తిపూడి సభ ద్వారా ఖండించే ప్రయత్నం చేశారు. 

"ఎంతసేపూ... నువ్వు విడిగా రా... నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను. కానీ ఒక్క విషయం... వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే... పెడతాను. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం" అంటూ పవన్ తన మనసులో మాట చెప్పారు.

పవన్ ప్రసంగం హైలైట్స్...

  • నేను వచ్చింది మీ భవిష్యత్తు కోసం. నా పిల్లల భవిష్యత్తును కూడా వదిలేసి వచ్చాను.
  • మన హక్కుల కోసం గళం విప్పాలి. 
  • ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన చేగువేరా పుట్టినరోజు. యాదృచ్ఛికంగా ఇవాళే వారాహి యాత్ర ప్రారంభమైంది.
  • నన్ను పరిపాలించే వాడు నాకంటే నిజాయతీపరుడై ఉండాలని ఆశిస్తాను. ఒక సాధారణ పౌరుడు అవినీతికి పాల్పడితే ఏసీబీ ఉంది... కానీ సీఎం అవినీతి చేస్తే ఎవరు పట్టుకోవాలి?
  • పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని గత ఎన్నికల్లో అందరూ నాపై కక్షగట్టి ఓడించారు. భీమవరం ఓట్ల జాబితాలో ఉండాల్సిన ఓట్ల కంటే 8 వేల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
  • ఈసారి ఎవడొస్తాడో చూస్తాను... నా గెలుపును ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతా. ఈసారి ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుంది.


Pawan Kalyan
Varahi Yatra
Chief Minister
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News