Botsa Satyanarayana: మోదీతో ఎలా ఉన్నామో.. అమిత్ షాతోను అలాగే ఉన్నాం: మంత్రి బొత్స
- అమిత్ షా చెప్పే వరకు జీవీఎల్ కు ఏపీలో అవినీతి కనిపించలేదా? అన్న బొత్స
- ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని వ్యాఖ్య
- తొమ్మిదేళ్ల తర్వాత రెవెన్యూ నిధులిచ్చారన్న బొత్స
- వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువ రావాలన్న మంత్రి
బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి జరిగిందని జీవీఎల్ చెబుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేవరకు ఆయనకు రాష్ట్రంలోని విషయం తెలియదా? అని ఎద్దేవా చేశారు. నిజంగానే అవినీతి జరిగితే ఇంతకాలం ఆయన ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తమ బంధం ఎలా ఉందో అమిత్ షాతోను అలాగే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేదన్నారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా బొత్స స్పందించారు. కొట్టు వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మినహా ఏపీకి బీజేపీ ఏం ఇచ్చిందని నిలదీశారు. తొమ్మిదేళ్ల తర్వాత రెవెన్యూ నిధులు ఇచ్చి ఉద్ధరించామని చెబితే ఎలా? అని ప్రశ్నించారు. వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలని, బీజేపీ నుండి తమకు ప్రత్యేక వెన్నుదన్ను ఏమీ లేదన్నారు.