t20: ఒక్క బంతికి 18 పరుగులు.. టీ20 చరిత్రలోనే అత్యధిక ఖరీదైన చివరి బంతి
- టీఎన్ పీఎల్ లీగ్ లో అభిషేక్ తన్వార్ పేలవ బౌలింగ్
- ఆఖరి బంతి పూర్తి చేసే క్రమంలో మూడు నోబాల్స్, వైడ్ వేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
టీ20ల్లో ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయడం కష్టమైన విషయమే. మంచి బ్యాటర్ ఉంటేనే అన్ని పరుగులు సాధ్యం అవుతాయి. అదే ఇన్నింగ్స్ ఆఖరి బంతికే 18 వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడమే కష్టం అనిపిస్తుంది కదా. కానీ, తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఓ బౌలర్ ఒక్క బంతికి అది కూడా ఇన్నింగ్స్ చివరి బాల్ కు అన్ని పరుగులు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. 20వ ఓవర్ ఆఖరి బంతికి అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అతని పేరు అభిషేక్ తన్వర్. టీఎన్ పీఎల్‌లో పోటీ పడుతున్న సాలెం స్పార్టాన్స్ జట్టుకు కెప్టెన్ కూడా. మంగళవారం రాత్రి చెపాక్ సూపర్ గల్లీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతను ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
సూపర్ గల్లీస్ ఆఖరి ఓవర్లో తొలి ఐదు బంతులకు ఎనిమిది పరుగులు ఇచ్చిన అభిషేక్ ఆఖరి బంతి వేసేందుకు ఇక్కట్లు పడ్డాడు. తొలుత అతను వేసిన బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, అది నో బాల్ అయింది. ఆ తర్వాత కూడా నోబాల్ వేయగా బ్యాటర్ సిక్సర్ కొట్టాడు. మూడో ప్రయత్నంలోనూ నోబాల్ వేయగా.. డబుల్ తీశాడు. తర్వాత వైడ్ వేసిన అభిషేక్ ఎట్టకేలకు సరైన బంతి వేయగా మరో సిక్సర్ వచ్చింది. మొత్తంగా చివరి బంతి కోసం ఏకంగా ఐదు డెలివరీలు వేయగా 18 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.