Telangana: తెలంగాణలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీలు
- సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి గంగుల
- త్వరలో అనుమతుల మంజురు
- ఈ విద్యా సంవత్సరం నుండే తరగతుల ప్రారంభానికి చర్యలు
ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్ మాట్లాడుతూ... డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తరగతుల ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో వర్గల్ కాలేజీకి అదనంగా 2022-23 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని క్లాసులను ప్రారంభించుకున్నామని, ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని తెలిపారు.
తాజాగా జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీకి సీఎం అనుమతినిస్తూ మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం బీసీలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యం వైపు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడానికి నిదర్శనం అన్నారు. గత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాలను కూడా ప్రారంభించినట్లు చెప్పారు.