Sourav Ganguly: ఆ విషయం విరాట్ కోహ్లీ ఒక్కడే చెప్పగలడు: గంగూలీ

sourav ganguly big revelation on captaincy saga of kohli

  • కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని విరాట్‌ను బీసీసీఐ ఎన్నడూ కోరలేదన్న గంగూలీ 
  • అతడు అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని వ్యాఖ్య 
  • కోహ్లీ తర్వాత కెప్టెన్ గా రోహిత్‌ శర్మనే సరైన వ్యక్తిగా భావించామని వెల్లడి 
  • ప్రపంచకప్‌ను గెలవడం కంటే ఐపీఎల్‌ విజేతగా నిలవడమే కష్టమన్న దాదా

గతేడాది జనవరిలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వదులుకున్నాడు. అప్పట్లో బీసీసీఐ చీఫ్ గా ఉన్న గంగూలీతో విభేదాల కారణంగానే కెప్టెన్ గా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత కోహ్లీ, గంగూలీ మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. వాటి ప్రభావం ఇటీవలి ఐపీఎల్ సీజన్ లోనూ కనిపించింది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరబ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బీసీసీఐ ఎన్నడూ కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని విరాట్‌ను కోరలేదని గంగూలీ స్పష్టం చేశాడు. ‘‘విరాట్ టెస్టు కెప్టెన్సీని వదులుకున్నప్పుడు బీసీసీఐ అందుకు సిద్ధంగా లేదు. బోర్డు ఆశ్చర్యానికి గురైంది. దక్షిణాఫ్రికా సిరీస్‌ తర్వాత అలా ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. కేవలం కోహ్లీ మాత్రం కారణాన్ని చెప్పగలడు’’ అని వ్యాఖ్యానించాడు.

అయితే విరాట్‌ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత రోహిత్‌ శర్మనే సరైన ఎంపికగా తాము భావించామని గంగూలీ చెప్పాడు. ఆ సమయంలో అతడే కరెక్ట్‌ అనిపించిందని తెలిపాడు. ‘‘విరాట్ అద్భుతమైన నాయకుడు. రవిశాస్త్రి-విరాట్ ఆధ్వర్యంలో టీమ్‌ఇండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ గడ్డపై నిర్భయంగా క్రికెట్‌ ఆడారు’’ అని చెప్పుకొచ్చాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినప్పటికీ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా తప్పకుండా రాణిస్తుందనే నమ్మకం తనకు ఉందని గంగూలీ తెలిపాడు. రోహిత్ నాయకత్వంలో ముంబయి ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచిందని, అతడిపై పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు.

‘‘రోహిత్, ధోనీ మాత్రమే ఐదేసి ఐపీఎల్ కప్‌లను గెలిచారు. ఐపీఎల్‌ లో విజేతగా నిలవడం చాలా కష్టం. పద్నాలుగేసి లీగ్‌ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్‌ ఆడి మరీ చాంపియన్‌గా నిలవాలి. అదే ప్రపంచ కప్‌లో నాలుగైదు విజయాలు సాధిస్తే సెమీస్‌కు వెళ్లిపోవచ్చు. అందుకే ప్రపంచకప్‌ను గెలవడం కంటే ఐపీఎల్‌ విజేతగా నిలవడమే కష్టమని చెబుతా’’ అని గంగూలీ వివరించాడు.

More Telugu News