GVL Narasimha Rao: డ్రామా రాజకీయాలను జగన్ మానుకోవాలి: జీవీఎల్ నరసింహారావు
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చన్న జగన్
- బీజేపీ మీకు ఎందుకు అండగా ఉంటుందని ప్రశ్నించిన జీవీఎల్
- తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా జగన్ మాట్లాడారని ఆగ్రహం
ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ తప్పుపట్టారు. ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తుంటే... వైసీపీకి ఇప్పటి వరకు బీజేపీ అండగా ఉందనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని.. ఇలాంటి భ్రమ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు.
వైసీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వం కాదని... వైసీపీతో తాము ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నామని జీవీఎల్ చెప్పారు. అమిత్ షా వంటి కీలక నేత రాష్ట్రానికి వచ్చి వైసీపీ అవినీతిని ఎండగడుతూ, అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడితే... మీరు మళ్లీ డ్రామా రాజకీయాలు మాట్లాడతారా? అని మండిపడ్డారు. బీజేపీ మీకు ఎందుకు అండగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా పర్యటనతో వైసీపీ పట్ల తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశామని తెలిపారు. అమిత్ షా చెప్పినట్టు విశాఖలో భూదందా నిజమేనని అన్నారు. దమ్ముంటే సిట్ నివేదికలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.