Anam Ramanarayana Reddy: ఏపీని ఆలీబాబా 40 దొంగలు దోచేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

anam ramanarayana reddy comments over ysrcp govt
  • మాఫియా గ్యాంగ్ లు రాష్ట్రాన్ని ఏలుతున్నాయన్న ఆనం
  • ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో దోపిడీ సాగుతోందని ఆరోపణ
  • ప్రభుత్వ వ్యవస్థలో జరిగే దోపిడీని ప్రశ్నించినందుకే పార్టీ నుంచి పంపేశారని వ్యాఖ్య
  • మీటర్ ఉన్న రాష్ట్రం జానా బెత్తెడు అయిందని, దీనికి మళ్లీ మూడు రాజధానులని సెటైర్
ఏపీని ఆలీబాబా 40 దొంగలు దోచేస్తున్నారని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో దోపిడీ సాగుతోందని ఆరోపించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 13న నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. యాత్ర నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేశారు. దొంగల ముఠా తయారైంది. ఆలీబాబా 40 దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ దోపిడీలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్న తేడా లేదు. మాఫియా గ్యాంగ్ లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి’’ అని మండిపడ్డారు.

‘‘వైసీపీ నుంచి నన్ను సాగనంపడానికి కారణమేంటి? నేనెవరినీ బూతులు తిట్టలేదు. నేనెవరనీ హింసించలేదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో జరిగే దోపిడీని, ఆ దోపిడీకి కారకులైన వారిని ప్రశ్నించడమే నా నేరంగా ఈ ప్రభుత్వం, పార్టీ పరిగణించాయి. తట్టెడు మట్టి వేయకుండా అభివృద్ధి చేశామని చెబితే.. గ్రామాల్లో ఎవరు మనల్ని మన్నిస్తారని ప్రశ్నించాను. ఇదేమైనా తప్పా?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘ఒకప్పుడు మీటర్ ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు జానా బెత్తెడు అయింది. దీనికి మళ్లీ మూడు రాజధానులు. రాష్ట్రం పూర్తి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర ప్రజల మీద రూ.10 లక్షల కోట్ల అప్పు మోపారు’’ అని ఆనం ఆరోపించారు. రాష్ట్రంలో ఏకంగా గంజాయి వనాలనే పెంచుతున్నారని, మాదక ద్రవ్యాల వల్ల ఒక తరం నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Anam Ramanarayana Reddy
Nara Lokesh
Yuva Galam Padayatra
YSRCP
TDP
Nellore District

More Telugu News