Prime Minister: భారత స్పైసీ వంటలపై జపాన్ రాయబారి హాస్యంగా ట్వీట్.. ప్రధాని మోదీ స్పందన
- దేశవ్యాప్తంగా భార్యతో కలసి పర్యటిస్తున్న జపాన్ రాయబారి
- కొల్హాపురిలో ఘాటు వంటకాలను రుచి చేసిన హిరోషి సుజుకీ
- తన భార్య కొట్టిందంటూ మిరపకాయ ఎమోజీతో ట్వీట్
- ఓటమిని పట్టించుకోని పోటీ ఇదంటూ ప్రధాని స్పందన
మన దేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి, తన భార్యతో కలసి భారత్ లోని వైవిధ్యమైన వంటల రుచులను ఆస్వాదిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనన్ని ఆహార రుచులకు మన దేశం కేంద్రం అన్న సంగతి తెలిసిందే. హిరోషి సుజుకి వారణాసిని సందర్శించి, అక్కడ బనారసి చాట్ రుచి చూశారు. తాలీని కూడా తిన్నారు. తర్వాత ముంబైకి వెళ్లారు. అక్కడ వడా పావ్ రుచి చూశారు. దాన్ని ఎంతో బాగా ఇష్టపడిన ఆయన, కాస్తంత ఘాటుగా ఉన్నట్టు చెప్పారు.
ఇక కొల్హాపూరిలో తిన్న ఆహారానికి హిరోషి సుజుకి కళ్లవెంట నీళ్లు తిరిగాయి. కొల్హాపురి వంటలు సహజంగా ఎంతో ఘాటుగా ఉంటాయి. ఈ ఘాటుకు జపాన్ రాయబారి హాస్యంగా స్పందించారు. ఆహారం తింటున్న వీడియోని పోస్ట్ చేసి ‘నా భార్య నన్ను కొట్టింది’ అని క్యాప్షన్ వేసి, దాని పక్కనే మిరపకాయ ఎమోజీ వేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే హాస్యంగా స్పందించారు.
‘‘ఓటమి గురించి పట్టించుకోని పోటీ ఇది. మిస్టర్ అంబాసిడర్, మీరు భారత దేశ పాకశాస్త్ర వైవిధ్యాన్ని ఆస్వాదిస్తున్నందుకు, ఇలా వినూత్నంగా స్పందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వీడియోలు మీ నుంచి మరిన్ని రావాలి’’ అంటూ ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.