Sharad Pawar: మేనల్లుడికి పార్టీ పదవి దక్కకపోవడంపై శరద్ పవార్ ఏమన్నాడంటే..!
- ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
- అజిత్ పవార్ కు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయన్న పవార్
- శరద్ పవార్ ప్రకటనతో అజిత్ లో అసంతృప్తి.. మీడియాకు దూరం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలేలను నియమించిన శరద్ పవార్.. తన మేనల్లుడు అజిత్ పవార్ కు పదవి దక్కకపోవడంపై తాజాగా స్పందించారు. దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం తోడ్పడుతుందని వివరించారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల బాధ్యతలను ఒక్కరికే అప్పగించడం సరికాదనే ఉద్దేశంతోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
మేనల్లుడు అజిత్ పవార్ పార్టీలో ఇప్పటికే చాలా బాధ్యతలను నిర్వహిస్తున్నారని శరద్ పవార్ చెప్పారు. మరిన్ని బాధ్యతలు అప్పగించడమంటే అజిత్ కు భారంగా మారుతుందని వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ ప్రతిపక్ష నేతగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పవార్ గుర్తుచేశారు. ఎన్సీపీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ శరద్ పవార్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో ప్రఫుల్ పటేల్ ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పవార్ సాబ్ తో కలిసి పనిచేస్తున్నానని, ఈ ప్రమోషన్ తన బాధ్యతను మరింత పెంచిందని పటేల్ వివరించారు.
పవార్ నిర్ణయం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని వివరించారు. ఇక, సుప్రియా సూలే కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడికి, సీనియర్ నేతలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, పవార్ నిర్ణయంపై అజిత్ పవార్ మాత్రం అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు.