KTR: అతడు చెప్పిన సమాధానంతో బిత్తరపోయాను: మంత్రి కేటీఆర్

KTR speech about cleanness

  • తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
  • పరిశుభ్రత అంశంపై మాట్లాడిన మంత్రి
  • జపాన్ లో పర్యటనలో అక్కడి నగరాలను చూసి ఆశ్చర్యపోయానని వెల్లడి
  • ఎక్కడా చెత్త కనిపించలేదని ఆశ్చర్యం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారుల పైనే కాకుండా, ప్రజలపై కూడా ఉందని అన్నారు. 

పరిశుభ్రత విషయంలో ప్రజలు సహకరిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, తన జపాన్ పర్యటనలో జరిగిన సంఘటనలను కేటీఆర్ వెల్లడించారు. 

"జపాన్ లో ఎక్కడ చూసినా క్లీన్ గా కనిపించింది. ఏ ఊరు చూసినా చెత్త కనిపించడంలేదు... రోడ్లు, ఫుట్ పాత్ లు అన్నీ నీట్ గా కనిపించాయి. అక్కడ శుభ్రం చేసే సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఈ చమత్కారం ఏంది అనుకుంటూ ఎంతో ఆశ్చర్యపోయాను. 

ఎవరైనా సీక్రెట్ గా వచ్చి రోడ్లు, వీధులు శుభ్రం చేస్తున్నారేమో అని రెండ్రోజులు జాగ్రత్తగా గమనించాను. ఎవరూ కనిపించలేదు. ఇక ఉండబట్టలేక అక్కడే కాన్సులేట్ లో పనిచేసే ఓ జపనీస్ మిత్రుడ్ని అడిగాను. మీ టోక్యో నగరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుతారు మీరు? అని అడిగాను. అతడు ఓ నవ్వు నవ్వాడు కానీ సమాధానం చెప్పలేదు. 

మరుసటి రోజు కూడా అతడిని ఇదే ప్రశ్న అడిగాను. నేను మున్సిపల్ మినిస్టర్ ను... ఇక్కడి శుభ్రత గురించి నేను మావాళ్లతో చెప్పాలి అన్నాను. దాంతో, వీడు వదిలేట్టు లేడు అని భావించి అతడు సమాధానం చెప్పాడు. "మేం ఎక్కడైనా అపరిశుభ్రం చేస్తే కదా శుభ్రం చేయడానికి" అని బదులిచ్చాడు. ఇదేందిరా వీడు ఇలా చెబుతున్నాడు అనుకుని బిత్తరపోవడం నావంతైంది. అతడు చెప్పింది నిజమా కాదా అని నేను అక్కడ పరిశీలించాను. 

మనం బహిరంగ ప్రదేశాల్లో బాటిల్ లో నీళ్లు తాగి అక్కడే పడేస్తాం. కానీ, జపాన్ లో ఆ బాటిల్ ను అక్కడున్న డస్ట్ బిన్ లోనే వేస్తారు. డస్ట్ బిన్ లేకపోతే ఆ బాటిల్ ను ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో ఉన్న డస్ట్ బిన్ లో పడేస్తారే తప్ప రోడ్డు మీద మాత్రం వేయరు. 

ఈ సంస్కారం, ఈ నాగరికత నిదానంగా అలవడుతుంది... ఒక్కసారిగా రాదు. అన్నప్రాసన రోజునే అవకాయ అంటే కుదరదు... మేం వార్డ్ ఆఫీసులు పెట్టాం కాబట్టి తెల్లారేసరికి హైదరాబాద్ శుభ్రం అయిపోవాలంటే అయ్యే పని కాదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. 

కాకపోతే, ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేయాలి. ప్రజలను కూడా మమేకం చేసి, వార్డ్ కమిటీల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలి. భవిష్యత్తులో హైదరాబాదు అంటే టోక్యోతో పోటీపడే అద్భుతమైన పారిశుద్ధ్య నగరం అనిపించుకోవాలి. 

నేనీ మాట అనగానే పేపర్ వాళ్లు... కేటీఆర్ హైదరాబాద్ ను టోక్యో చేస్తానన్నాడు అని రాస్తారు. నేను రేపే చేస్తానని చెప్పడంలేదు... అందుకు కొంత సమయం పడుతుంది... ప్రజల భాగస్వామ్యంతో అది సాకారం అవుతుంది" అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News