Innova Crysta: 8 సీట్ల ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ కు వ్యక్తిగత వాహన రిజిస్ట్రేషన్ లో సమస్య..
- కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రోజుల పాటు ఎదురైన పరిణామం
- వాహన్ పోర్టల్ లో చేసిన మార్పులతో సమస్య
- పరిష్కరించిన అధికారులకు థ్యాంక్స్ చెప్పిన టయోటా కిర్లోస్కర్
వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని పరివాహన్ వెబ్ సైట్ 8 సీట్లు కలిగిన వాహనాలను ప్రైవేటు వాహనాలుగా (వ్యక్తిగతంగా వాడుకునేవి) గుర్తించడాన్ని నిలిపివేసింది. కొన్ని రాష్ట్రాల పరిధిలో టయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ మోడళ్లను ప్రైవేటు వాహనాలుగా రిజిస్ట్రేషన్ కు అనుమతించడం లేదు. గత నెల 22 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్టు సమాచారం. ‘ఓమ్ని బస్’ పేరుతో కొత్త విభాగం ఏర్పాటు చేశారు. 8 సీట్ల వాహనాలను ఈ విభాగం కింద రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఓమ్ని బస్ విభాగం ట్రాన్స్ పోర్ట్ (రవాణా) విభాగం కిందకు వస్తుంది.
పరివాహన్ వెబ్ సైట్ లో ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టయోటా కిర్లోస్కర్ మోటార్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘‘8 సీటర్ వాహనాలను కొన్నిరాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసే విషయంలో సమస్య ఎదురైంది. వాహన్ పోర్టల్ లో కొన్ని మార్పులు చేయడమే ఇందుకు దారితీసింది. బ్యాకెండ్ లో సిస్టమ్ అప్ గ్రేడ్ చేసిన తర్వాత, ఇప్పుడు వాహనాల రిజిస్ట్రేషన్ సాఫీగా సాగుతోంది’’ అని ప్రకటించారు. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఓమ్నిబస్ విభాగం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ఏటా ఫిట్ నెస్ పరీక్ష అవసరం పడుతుంది.