Nara Lokesh: న్యాయవాదులకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం: నారా లోకేశ్
- కడపలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- న్యాయవాదులతో ముఖాముఖి
- జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని లోకేశ్ విమర్శలు
- జగన్ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని వెల్లడి
కడపలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయవాదులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ ఒక ఉగ్రవాది అని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చి పరిపాలన ప్రారంభించారని ఆరోపించారు.
జగన్ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని తెలిపారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని లోకేశ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని అన్నారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారం చేపట్టాక హెల్త్ కార్డులు అందిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. నాణ్యమైన ఇళ్లు కట్టించి న్యాయవాదులకు ఇస్తామని వెల్లడించారు.
టీడీపీ లీగల్ సెల్ ను బలోపేతం చేస్తున్నామని వివరించారు. న్యాయవాదులకు నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని, టీడీపీ అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.