Chinese professionals: చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్క నిపుణుడిపై కేంద్రం సునిశిత పరిశీలన.. వీసాల జారీలో ఆలస్యం

Visa delays for Chinese professionals hit India businesses

  • ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్ర సర్కారు
  • కరోనా తర్వాత భారత్ లో 66 శాతం తగ్గిపోయిన చైనా ఉద్యోగులు
  • పెట్టుబడుల ప్రతిపాదనలకు లభించని మోక్షం

భారత్ ను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్న చైనా జాతీయులపై కేంద్ర సర్కారు సునిశిత పరిశీలన అమలు చేస్తోంది. వారికి వీసాలను మంజూరు చేసే విషయంలో, భారత్ లో వారి పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ అనే భారత కంపెనీ రూ.400 కోట్లతో రిఫ్రిజిరేటర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో ఉంది. చైనా నుంచి ఇంజనీర్లు వస్తే కానీ పనికాదు. కానీ, వారికి వీసాలు లభించడం లేదు. దీంతో తమ ఇంజనీర్లను శిక్షణ కోసం చైనా, తైవాన్ పంపించాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కేసుల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. 

మన దేశంలో పీఎల్ఐ కింద పరిశ్రమల ఏర్పాటుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కానీ, వాటి ఏర్పాటుకు చైనా కంపెనీల సహకారం కావాల్సి వస్తోంది. తమ ప్లాంట్ల ఏర్పాటుకు చైనా సాంకేతిక అనుభవం అవసరమని, వారిని అనుమతించకపోతే భారత్ లో తయారీ లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ లాల్ పేర్కొన్నారు. టాటా గ్రూపు కంపెనీ వోల్టాస్, చైనా కంపెనీ హైలీ ఇంటర్నేషనల్ తో కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇరు సంస్థల సంయుక్త కంపెనీ రూ.500 కోట్లతో ఇన్వర్టర్ ఏసీ కంప్రెషర్లను తయారు చేయనున్నాయి. దీనికి కూడా అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. 

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ లో సీఈవోలు లేరు. వీసాలకు ఆమోదం రాకపోవడంతో కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్, ఒప్పో ఇండియా సీఈవో ఎల్విస్ జూ, సేల్స్ డైరెక్టర్ చెన్ మిన్, షావోమీ ఇండియా హెడ్ అల్విన్ సే వీసా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే భారత్ లో పనిచేసే చైనీయుల సంఖ్య మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లో పనిచేసే కంపెనీలు ఇక్కడి నైపుణ్యాలపైనే ఆధారపడాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. కానీ, ఇందుకు సమయం తీసుకుంటుందని పరిశ్రమ అంటోంది.

  • Loading...

More Telugu News