Gitanjali Aiyer: దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూత
- 1971లో దూరదర్శన్‌లో చేరిన గీతాంజలి అయ్యర్
- గత కొంతకాలంగా పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్న వైనం
- వాకింగ్‌కు వెళ్లొచ్చి కుప్పకూలిన గీతాంజలి
- ఉత్తమ యాంకర్‌గా నాలుగుసార్లు అవార్డులు
దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్ గీతాంజలి అయ్యర్ (70) కన్నుమూశారు. దూరదర్శన్‌లో ఇంగ్లిష్ న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసిన ఆమె గత కొంతకాలంగా పార్కిన్‌సన్స్ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
కోల్‌కతాలోని లొరేటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అయ్యర్ 1971లో దూరదర్శన్‌లో చేరారు. ఉత్తమ యాంకర్‌గా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. 1989లో ఔట్‌స్టాండింగ్ మహిళగా ఇందిరాగాంధీ ప్రియదర్శని అవార్డు అందుకున్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) డిప్లొమా అందుకున్న గీతాంజలి పలు ప్రింట్ యాడ్స్‌లో ప్రముఖంగా కనిపించారు. శ్రీధర్ క్షీర్‌సాగర్ టీవీ డ్రామా ‘ఖాందాన్’లో నటించారు. ఆమె తన సుదీర్ఘ కెరియర్‌లో వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.