India: గుడ్ న్యూస్.. నైరుతి రాక రేపే!
- శుక్రవారం కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
- గతేడాదితో పోలిస్తే నైరుతి రాక వారానికిపైగా ఆలస్యం
- గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
- భారత వాతావరణ శాఖ వెల్లడి
కొద్ది రోజులుగా దోబూచులాడుతూ ఇబ్బందులు పెట్టిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించాయి. శుక్రవారానికల్లా ఇవి కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాకలో వారానికిపైగా జాప్యం జరిగింది.
ఇక, తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా బంట్వారంలో 5.1, నారాయణపేట్ జిల్లా దామరగిద్దలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.
మరోవైపు కరీంనగర్ జిల్లాలో గరిష్ఠంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది.