Anurag Thakur: అనురాగ్ ఠాకూర్ తో భేటీ.. జూన్ 15 వరకు నిరసనలకు బ్రేక్ ఇచ్చిన రెజ్లర్లు!

Wrestlers suspend protest till June 15 after meeting with Sports Minister Anurag Thakur

  • జూన్ 15 వరకు బ్రిజ్ భూషణ్ పై చర్యలకు గడువిచ్చిన రెజ్లర్లు
  • ఆ లోగా విచారణ పూర్తి చేయాలని లేదంటే తిరిగి చేపడతామని వెల్లడి
  • WFIలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉందన్న అనురాగ్ ఠాకూర్

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో చాలారోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న టాప్ రెజ్లర్లతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సానుకూలంగా ముగిసింది. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవడానికి జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు రెజ్లర్లు. అప్పటి వరకు తమ నిరసనను తాత్కాలికంగా నిలిపివేస్తామని, గడువులోగా చర్యలు తీసుకోకుంటే జూన్ 15 తర్వాత తిరిగి నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పోలీసులు జూన్ 15వ తేదీ లోగా విచారణను పూర్తి చేస్తామని చెప్పారని, కాబట్టి అప్పటి వరకు తమ నిరసనను ఆపివేస్తున్నామని, ఆ లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని సాక్షి మాలిక్ అన్నారు. తాము జూన్ 15 వరకు నిరసనను విరమించుకుంటున్నామని, కానీ చర్యలు తీసుకోకుంటే ఈ నిరసన పూర్తి కానట్లేనని బజ్ రంగ్ పునియా అన్నారు.

రెజ్లర్లతో భేటీ అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కలిగి ఉందని, దీనికి మహిళ సారథ్యం వహిస్తున్నారని చెప్పారు. రెజ్లర్లతో భేటీ సానుకూలంగా ముగిసిందన్నారు. రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి జూన్ 15వ తేదీ లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తారన్నారు. రెజ్లర్లపై అన్ని ఎఫ్ఐఆర్ లు కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే బ్రిజ్ భూషణ్ కు మరోసారి ఆ పదవి కట్టబెట్టవద్దని రెజ్లర్లు కోరారని చెప్పారు. జూన్ 15వ తేదీ వరకు వారు ఎలాంటి నిరసన వ్యక్తం చేయరన్నారు.

More Telugu News