WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతంటే..!
- లండన్ లోని ఓవల్ స్టేడియంలో నేడు మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్
- తలపడుతున్న ఇండియా-ఆస్ట్రేలియా జట్లు
- విజేతకు రూ.13.63 కోట్లు.. రన్నరప్ కు రూ.6.61 కోట్ల ప్రైజ్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్లు ట్రోపీ కోసం పోటీపడుతున్నాయి. ఐదు రోజుల ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీ మొత్తం 38 లక్షల అమెరికన్ డాలర్లు. ఈ మొత్తాన్ని టోర్నీలో పాల్గొన్న జట్లకు వాటి స్థానాలను బట్టి పంచుతారు. ఇందులో దాదాపు సగం ఫైనల్ లో విజేతగా నిలిచిన జట్టుకే దక్కుతుంది.
డబ్ల్యూటీసీ విన్నర్ కు ట్రోఫీతో పాటు 16 లక్షల అమెరికన్ డాలర్లు.. అంటే మన రూపాయల్లో దాదాపుగా రూ.13.23 కోట్లు అందజేస్తారు. రన్నరప్ కు 8 లక్షల డాలర్ల (రూ.6.61 కోట్లు) ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక ఈ టోర్నమెంట్ లో మూడో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా జట్టు 4.50 లక్షల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ 3.5 లక్షల డాలర్లు, ఐదో స్థానంలో నిలిచిన శ్రీలంక జట్టుకు 2 లక్షల డాలర్లు దక్కనున్నాయి. తర్వాతి స్థానాల్లో నిలిచిన న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్ జట్లు తలా లక్ష డాలర్ల చొప్పున అందుకోనున్నాయి.