Zerodha: నా సంపదలో అధిక శాతం సమాజానికి ఇచ్చేస్తా: నిఖిల్ కామత్
- మరింత సమానత్వంతో కూడిన సమాజానికి కృషి చేస్తానని ప్రకటన
- సమాజంపై సానుకూల ప్రభావం చూపించాలని నిర్ణయం
- ద గివింగ్ ప్లెడ్జ్ కార్యక్రమంలో చేరిన నిఖిల్ కామత్
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోదా’ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (35) చిన్న వయసులోనే పెద్ద మనసు చాటారు. తన సంపదలో అధిక శాతాన్ని సమాజం కోసం ఇచ్చేస్తానని ఆయన తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరిపోయారు. వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించారు.
ఇందులో భాగంగా సమాజం కోసం తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు నిఖిల్ కామత్ కావడం గమనించొచ్చు. ఇంతకుముందు విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన శ్రీమతి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు.
‘‘ఒక యువ దాతృత్వవాదిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూ దీన్ని రాస్తున్నాను. ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం నా విలువలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది’’ అని కామత్ వివరించాడు.