Manipur: ఇప్పటికీ తేరుకోని మణిపూర్.. అస్తవ్యస్తంగానే జనజీవనం

Life hobbles in violence hit Manipur

  • మండిపోతున్న నిత్యావసరాల ధరలు
  • రాష్ట్రంలో పెట్రోల్ కు తీవ్ర కొరత.. బంకుల ముందు బారులు
  • బ్లాక్ మార్కెట్లో రూ.200 లకు చేరిన లీటర్ పెట్రోల్ ధర
  • ఏటీఎంల ముందు ‘నో క్యాష్’ బోర్డులు
  • అత్యవసర మందులకూ తప్పని కొరత

రెండు తెగల మధ్య మొదలైన వివాదం రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలకు దారితీసింది.. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం అట్టుడికింది. ఇండ్లు, వాహనాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. దీంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎక్కడికక్కడ అల్లర్లను అణచివేశాయి. ప్రత్యేక బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ లో మైతీ, కుకీ తెగల మధ్య రేగిన గొడవే దీనంతటికీ కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగడంలేదు. అయినప్పటికీ జనజీవనం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు.

నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్ కు తీవ్ర కొరత ఏర్పడింది. అల్లర్ల కారణంగా మణిపూర్ లోకి లారీలను నడిపేందుకు డ్రైవర్లు విముఖత ప్రదర్శించడంతో పెట్రోల్, డీజిల్ సహా పలు నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ కొరత కారణంగా ఇంఫాల్ లోయలో వాహనదారులు బంక్ ల ముందు బారులు తీరుతున్నారు. వాహనాలతో చాంతాడంత క్యూలో నిలుచుంటున్నారు.

అత్యవసర సందర్భాలలో పెట్రోల్ కోసం బ్లాక్ మార్కెట్ లో లీటర్ కు రూ.200 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. లోయకు వెళ్లే హైవేను బ్లాక్ చేయడంతో వస్తుసేవల పంపిణీ నిలిచిపోయింది. అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. దీంతో వాటి ధరలు కూడా చుక్కలను అంటుతున్నాయి. గతంలో కేజీ బియ్యం రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60 కి పెరిగింది. గతంలో కిలో రూ.35 గా ఉన్న ఉల్లిగడ్డల ధర ఇప్పుడు కిలో 70 రూపాయలకు చేరుకుంది. బంగాళదుంపలు, కోడిగుడ్లు, నూనె.. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయి.

మరోపక్క, ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగదు డ్రా చేసుకుందామని వెళ్లిన ఖాతాదారులను నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. దీనికి తోడు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ఆర్బీఐ చేసిన ప్రకటన మణిపూర్ వాసులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పెద్ద నోట్లు ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని మణిపూర్ వాసులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

Manipur
violence
Curfew
commodities
price hike
daily needs
petrol shortage

More Telugu News