Ambati Rambabu: అది మేనిఫెస్టో కాదు... మోస ఫెస్టో: మంత్రి అంబటి రాంబాబు
- ఇటీవల మేనిఫెస్టో వివరాలు ప్రకటించిన టీడీపీ
- చంద్రబాబు ఒక్క పేదవాడ్నయినా ధనికుడ్ని చేశారా అంటూ అంబటి ధ్వజం
- రుణమాఫీ మోసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటూ విమర్శలు
- ఎవరెన్ని చేసినా గెలిచేది జగనే అని ధీమా
ఇటీవల టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అది మేనిఫెస్టో కాదని, మోస ఫెస్టో అని అభివర్ణించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మేనిఫెస్టో అయినా అమలు చేశారా? ఒక్క పేదవాడ్నయినా ధనికుడ్ని చేశారా? అని ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ పేరిట మోసం చేసిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా మోసం చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. తను తీసుకువచ్చిన మేనిఫెస్టోను ఎవరూ చూడకుండా తగలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
టీడీపీ మేనిఫెస్టో ఓ బూటకం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అంబటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ మేనిఫెస్టో ఎలాంటిదో, టీడీపీ తీసుకువచ్చిన మేనిఫెస్టో సంగతేంటో ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.